త్వరలో గులాబీ పార్టీ ​ఖాళీ

త్వరలో గులాబీ పార్టీ ​ఖాళీ
  • టచ్​లో టీఆర్​ఎస్ ​ఎమ్మెల్యేలు
  • త్వరలో గులాబీ పార్టీ ​ఖాళీ
  • మునుగోడులో గెలిచేది మేమే
  • ఎమ్మెల్యే ఈటల రాజేందర్

యాదాద్రి/మునుగోడు, వెలుగు: కేసీఆర్​ ఎంత ప్రయత్నించినా.. రాష్ట్రంలో ఓటమి ఖాయమని, ఇప్పటికే కాంగ్రెస్​ ఖాళీ అయ్యిందని, త్వరలో టీఆర్ఎస్​ కూడా ఖాళీ అవుతుందని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, హుజురాబాద్ ​ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటికే కాంగ్రెస్​ చతికిలపడింది. ఇక లేచే పరిస్థితి లేదు. చాలామంది టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక లేకపోయి ఉంటే ఇప్పటికే టీఆర్ఎస్​ఖాళీ అయ్యేది’ అని అన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్​లో ఊహించని పరిణామాలు జరుగుతాయని, 15 రోజుల్లోనే అల్లకల్లోలం మొదలైందని, రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటు వేల సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్​లు కూడా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. 

ఎమ్మెల్యేలపై నిఘా పెట్టిండు


కేసీఆర్, ఎమ్మెల్యేల మధ్య ఆత్మీయ బంధం లేదని, అవసరాల బంధం మాత్రమే ఉందని ఈటల అన్నారు. తనకు మాత్రం టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలతో ఆత్మీయ సంబంధాలున్నాయన్నారు. కలిసి పనిచేసినం. కలిసి ఉద్యమం చేసినం. నన్ను బయటికి పంపించినప్పుడు అందరూ బాధపడ్డారని చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటు ఏ ఒక్క ప్రజా ప్రతినిధిని కేసీఆర్​ నమ్మరని, వారిపై నిఘా పెడ్తారని తెలిపారు. టీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన పని లేదని, దానంతట అదే కూలిపోతుందన్నారు. 2014 వరకు తెలంగాణ గాంధీగా పిలవబడిన కేసీఆర్, ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణ ద్రోహిగా ఎందుకు పిలవబడుతున్నారో టీఆర్​ఎస్​ వాళ్లే తెలుసుకోవాలని అన్నారు. 

కేసీఆర్​ను గద్దె దించడమే లక్ష్యం


రాచరిక కుటుంబ పాలనను అంతమొందించి  కేసీఆర్​ను గద్దె దింపడమే బీజేపీ లక్ష్యమని ఈటల రాజేందర్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఈటల సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల విలేకరులతో మాట్లాడారు. బీజేపీలో చేరుతున్న ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచులను టీఆర్ఎస్  ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఈ నెల 21న మునుగోడు మండల కేంద్రంలో జరిగే అమిత్ షా బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ  నల్గొండ, యాదాద్రి జిల్లాల అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, పీవీ శ్యాంసుందర్​రావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షణ్ముఖ, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.