- ఈ వాటర్ ఇయర్‌లో ఇప్పటి వరకు ఏకంగా 600 టీఎంసీల దాకా కృష్ణా నీళ్లు తరలింపు
- తెలంగాణ వాడుకున్నది దాదాపు 120 టీఎంసీలే..
- నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచే 350 టీఎంసీలు తీసుకెళ్లిన ఏపీ
- శ్రీశైలం నుంచి మరో 240 టీఎంసీలు తరలింపు
- సాగర్‌లో వేగంగా పడిపోతున్న నీటి నిల్వ.. పూర్తి సామర్థ్యానికి 65 టీఎంసీల లోటు
- పరిస్థితి ఇట్లనే ఉంటే కృష్ణా నీళ్ల తరలింపులో ఏపీ రికార్డు ఖాయం
- నిరుటి వాటర్ ఇయర్‌లో 734 టీఎంసీలను తీసుకపోయిన పక్క రాష్ట్రం
- ఈసారి అది 750 టీఎంసీలకు చేరుకుంటుందని అంచనా
- మనం మరో 100 టీఎంసీలైనా వాడుకుంటామా? లేదా? అనే ఆందోళనలు
హైదరాబాద్, వెలుగు: మన పక్కనే కృష్ణమ్మ పారుతున్నా, మన బీళ్లకు కావాల్సిన నీళ్లను మనం వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఏటా ఇదే జరుగుతున్నా, ఈ ఏడాది మరింత ఆందోళనకరంగా మారింది. 2015లో బీఆర్ఎస్ పాలకులు చేసిన సంతకాల పాపం.. ఇప్పటికీ తెలంగాణను వెంటాడుతూనే ఉన్నది. ఈ ఏడాది కృష్ణమ్మ ఉప్పొంగినా, రిజర్వాయర్లలో బొచ్చెడు నీళ్లున్నా.. మనం దోసెడు నీళ్లను వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వాటర్ఇయర్లో శ్రీశైలంలో 2,333.79 టీఎంసీల ఇన్ఫ్లోస్నమోదు కాగా, నాగార్జున సాగర్‌కు 1,818 టీఎంసీలు వచ్చాయి.
ఒకవైపు ఇన్‌ఫ్లోస్ వస్తుండగానే ఏపీ నీళ్లను తన్నుకుపోతున్నా.. మనం మాత్రం చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ వాటర్ఇయర్లో శ్రీశైలం, సాగర్‌లో కలిపి మొత్తం 810 టీఎంసీల నీటి వినియోగం జరగ్గా.. అందులో ఏపీ ఏకంగా 600 టీఎంసీల దాకా మళ్లించుకుంటే, మనం తీసుకున్న నీళ్లు దాదాపు 120 టీఎంసీలే. మిగతావి పవర్ జనరేషన్‌కు వినియోగించారు. కుండ అడుగున రంధ్రం పెట్టినట్టు.. ఏపీ ఇప్పటికే శ్రీశైలానికి గండికొట్టి పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను గద్దలెక్క తన్నుకుపోతున్నది. అటు నాగార్జునసాగర్‌లోనూ డెడ్‌స్టోరేజీ నుంచే ఇష్టారాజ్యంగా జలదోపిడీకి పాల్పడింది. అక్కడి నుంచి కూడా 350 టీఎంసీలకుపైగా జలాలను తరలించుకెళ్లింది.
అంతోఇంతో మనం వాడుకున్న నీళ్లు సాగర్‌వి మాత్రమే. మరోవైపు ప్రస్తుతం శ్రీశైలంతో పోలిస్తే నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ వేగంగా పడిపోతున్నది. ఇప్పటికే పూర్తిస్థాయి సామర్థ్యానికి, ఇప్పుడున్న నిల్వకు మధ్య 65 టీఎంసీల లోటు ఉంది. శ్రీశైలంలో ప్రస్తుతం వాడకాన్ని తగ్గించిన ఏపీ.. సాగర్‌పై ఫోకస్ పెట్టి నీటిని తరలిస్తుండడంతో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. సమ్మర్వరకు సాగర్నుంచే ఏపీ నీటిని తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. అప్పటివరకు శ్రీశైలం జలాలను ఆదా చేసుకుని, మళ్లీ సమ్మర్‌లో అక్కడి నుంచి జలాలను తాగునీటి పేరుతో తీసుకెళ్లే కుట్రలకు తెరలేపుతున్నట్టు సమాచారం. అదే జరిగితే ఇటు శ్రీశైలం, అటు సాగర్‌నుంచి సమ్మర్‌లో మనం నీళ్లు తీసుకునేందుకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సాగర్‌కూ గండి..
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఈ ఏడాది భారీగానే ఇన్ఫ్లోస్వచ్చాయి. మొత్తం 1,818 టీఎంసీల జలాలు రాగా, అందులో ఇప్పటిదాకా 565 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. సాగర్ ఎడమ కాల్వ ద్వారా మనం సుమారు 110 టీఎంసీల జలాలను వాడుకున్నాం. అదే ఏపీ సాగర్‌కుడి కాల్వ ద్వారా 350 టీఎంసీలకుపైగా జలాలను తీసుకెళ్లింది. మిగతా నీళ్లు జలవిద్యుదుత్పత్తి కోసం వినియోగించారు. ఏపీ ఇప్పటికీ కుడి కాల్వ ద్వారా రోజూ 10 వేల క్యూసెక్కుల నీళ్లను తరలించుకుపోతున్నది. ఈ నెల 7 నుంచి 16 వరకు రోజూ 10 వేల క్యూసెక్కులు ఏపీ తరలిస్తే.. మనం మాత్రం ఎడమ కాల్వ నుంచి సగటున 8,400 క్యూసెక్కులనే తరలించాం. ఆ తర్వాతి రోజు ఏపీ 8,400కు తగ్గించుకున్నా.. మళ్లీ 18వ తేదీ నుంచి 9,500 క్యూసెక్కులను డ్రా చేస్తున్నది. మన వినియోగం మాత్రం క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నది. 8,400 క్యూసెక్కుల నుంచి 7 వేల క్యూసెక్కులకు, ఇక ఇప్పుడైతే 6,200 క్యూసెక్కులను మాత్రమే ఎడమ కాల్వ ద్వారా తీసుకెళ్తున్నాం. గత నెలలో అయితే.. ఏపీ రోజూ సగటున 9,500 క్యూసెక్కుల జలాలను తీసుకెళ్తే.. మనం ఎడమ కాల్వ ద్వారా అందులో సగం కూడా తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
జులై నుంచే పోతిరెడ్డిపాడు ఖుల్లా..
శ్రీశైలానికి వరదలు ప్రారంభమైనప్పటి నుంచే ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి జలదోపిడీకి పాల్పడింది. జులై 6వ తేదీ నుంచే పోతిరెడ్డిపాడు గేట్లను ఏపీ ఖుల్లా పెట్టింది. తొలుత 3,500 క్యూసెక్కులతో మొదలుపెట్టి.. ఆ తర్వాత రోజూ 3 టీఎంసీలకు పెంచుకున్నది. ప్రాజెక్టు పూర్తిగా నిండకముందే వచ్చిన నీళ్లను వచ్చినట్టు తీస్కపోయిన ఏపీ.. ఇప్పటి వరకు ఒక్కపోతిరెడ్డిపాడు నుంచే 200 టీఎంసీలకుపైగా నీటిని తోడేసుకుంది. ఇటు హంద్రీనీవా నుంచి మరో 34 టీఎంసీల వరకు తోడుకున్నది.
మొత్తంగా 240 టీఎంసీలకుపైగా శ్రీశైలం నుంచి తీసుకున్నది. ఇప్పటికీ పోతిరెడ్డిపాడు నుంచి రోజూ 2 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి మరో 2 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుపోతున్నది. శ్రీశైలం నుంచి మనకున్న ఒకే ఒక్క సోర్సు కల్వకుర్తి లిఫ్టు. అక్కడి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ తోడిన నీళ్లు 13 టీఎంసీలు. పరిస్థితి ఇలాగే ఉంటే.. ఇటు సాగర్, అటు శ్రీశైలం నుంచి ఈ వాటర్ఇయర్ముగిసే నాటికి ఏపీ మరో వంద నుంచి 150 టీఎంసీల వరకు జలాలను తీసుకెళ్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే.. ఏపీ అత్యధికంగా డ్రా చేసిన నీళ్లలో రికార్డు సృష్టించడం ఖాయమంటున్నారు. ఈ వాటర్ఇయర్లో ఏపీ నీటి తరలింపులు 750 టీఎంసీల వరకు చేరుకుంటాయన్న అంచనా ఉంది. నిరుటి (2024–25) వాటర్ఇయర్లో ఏపీ మొత్తంగా 734 టీఎంసీల జలాలను తన్నుకుపోయింది. ఇక ఈ వాటర్ ఇయర్ ముగిసే సరికి మనం మరో వంద టీఎంసీలైనా కృష్ణా నది నుంచి వాడుకుంటామా? లేదా? అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణను ఆదుకున్న శ్రీరాంసాగర్..
మనం కృష్ణాలో నీళ్లను వాడుకోలేకపోయినా గోదావరి బేసిన్‌లో మాత్రం నీటి వినియోగం బాగానే జరిగినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీరాంసాగర్ప్రాజెక్ట్నుంచి అత్యధికంగా 91 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. అందులో కెనాల్స్ ద్వారా 41 టీఎంసీలు కాగా, లిఫ్టుల ద్వారా మరో 50 టీఎంసీలను వినియోగించారు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కెనాల్స్ద్వారా 8 టీఎంసీలు, లిఫ్టుల ద్వారా 7 టీఎంసీలను తాగు, సాగు అవసరాలకు ఇచ్చారు. సింగూరు నుంచి 21 టీఎంసీలు, నిజాంసాగర్‌నుంచి 9 టీఎంసీలు, కడెం నుంచి 6.4 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. లోయర్ మానేరు నుంచి 14 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. మల్లన్నసాగర్ నుంచి 8 టీఎంసీలను తరలించారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగిపోవడంతో అక్కడి నుంచి చుక్క నీటిని కూడా లిఫ్ట్‌చేయలేదు.
గోదావరి ప్రాజెక్టులు కళకళ..
ఈ ఏడాది వర్షాలు మంచిగా పడడం, ఇన్ఫ్లోస్ఎక్కువగా రావడంతో ఈ వాటర్ఇయర్లో నీళ్లకు ఢోకా లేకుండా పోయింది. ఇప్పటికీ ప్రాజెక్టులు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులతో పాటు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోనూ నీళ్లున్నాయి. గోదావరి బేసిన్‌లో ఒక్క సింగూరు మినహా మిగతా అన్ని ప్రాజెక్టులూ నిండుకుండల్లాగే ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టుకు రిపేర్ల నేపథ్యంలో ఆ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో స్టోర్చేయడం లేదు. ఇక ఇటు ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్‌లో 247 టీఎంసీలు, శ్రీశైలంలో 190 టీఎంసీల చొప్పున నీటి నిల్వ ఉంది.
ప్రాజెక్టుల్లోప్రస్తుతం నీటి నిల్వ (టీఎంసీల్లో)
ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం ప్రస్తుత నిల్వ
జూరాల 9.66 8.05
శ్రీశైలం 215.81 192.09
నాగార్జునసాగర్ 312.05 247.54
సింగూరు 29.92 16.7
నిజాంసాగర్ 17.8 15.67
శ్రీరాంసాగర్ 80.5 80.5
కడెం 4.7 4.7
ఎల్లంపల్లి 20.18 20.06
మిడ్‌మానేరు 27.55 26.99
లోయర్ మానేరు 24.03 24.04
