జీహెచ్‌‌ఎంసీకి కొత్త టీమ్.. హైదరాబాద్‌‌లో 12 జోన్లకు కొత్త కమిషనర్లు

జీహెచ్‌‌ఎంసీకి కొత్త టీమ్..  హైదరాబాద్‌‌లో 12 జోన్లకు కొత్త కమిషనర్లు
  •     వీరిలో 8 మంది ఐఏఎస్‌‌లు, నలుగురు సీనియర్ ఆఫీసర్లు 
  •     ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జయేశ్ రంజన్
  •     టీజీపీఎస్సీ సెక్రటరీగా ఎం.హరిత, 
  • ఎన్నికల సంఘం కార్యదర్శిగా లింగ్యానాయక్ 
  •     భారీగా ఐఏఎస్‌‌లను బదిలీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లోని దాదాపు అన్ని జోన్లకు ప్రభుత్వం కొత్త కమిషనర్లను నియమించింది. మొత్తం 12 జోన్లు ఉండగా.. 8 మంది ఐఏఎస్‌లు, నలుగురు సీనియర్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించింది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి, సుదీర్ఘకాలంగా ఐటీ, పరిశ్రమల శాఖలో సేవలందిస్తున్న జయేశ్ రంజన్‌కు ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన సీఎంవోలో స్పీడ్ సీఈవోగా ఉండగా, మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (హెచ్ఎండీఏ పరిధి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఈ శాఖను అదనపు బాధ్యతగా చూస్తున్న కె.రామకృష్ణారావును ఆ బాధ్యతల నుంచి తప్పించింది. అయితే జయేశ్ రంజన్ పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖల కార్యదర్శిగా, ఆర్కియాలజీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతల్లో కూడా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక స్పీడ్ సీఈవో బాధ్యతలను సీఎస్ వద్దే ఉంచింది. ఇక నారాయణపేట అడిషనల్ కలెక్టర్‌గా (లోకల్ బాడీస్) నారాయణ అమిత్ మాలెంపాటిని, హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా (లోకల్ బాడీస్) జి.జితేందర్ రెడ్డిని, హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా (రెవెన్యూ) పి.కదిరవన్‌ను నియమించింది.  

జీహెచ్‌ఎంసీ టీమ్ ఇదే.. 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. సిటీలోని 12 జోన్లకు కొత్త కమిషనర్లను నియమించింది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యువ ఐఏఎస్‌లకు అవకాశం కల్పించింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌‌గా భోర్ఖడే హేమంత్ సహదేవరావు, కూకట్‌పల్లికి అపూర్వ్ చౌహాన్, కుత్బుల్లాపూర్‌‌కు సందీప్ కుమార్ ఝా, చార్మినార్‌‌కు ఎస్.శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండకు హైదరాబాద్ అడిషనల్ (రెవెన్యూ) కలెక్టర్ జి.ముకుంద రెడ్డిని, ఖైరతాబాద్‌కు టీజీపీఎస్సీ సెక్రటరీ ప్రియాంక అలాను, రాజేంద్రనగర్‌‌కు అనురాగ్ జయంతి, సికింద్రాబాద్‌కు ఎన్.రవికిరణ్, శంషాబాద్‌కు చేవెళ్ల ఆర్డీవో కె.చంద్రకళను, ఎల్బీ నగర్‌‌కు హేమంత కేశవ్ పాటిల్, మల్కాజిగిరికి నారాయణ అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌‌ను, ఉప్పల్‌ జోనల్ కమిషనర్‌‌గా రాధికా గుప్తాను నియమించారు. రాధికా గుప్తా మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గానూ కొనసాగుతారు.  

ఇతర కీలక బదిలీలు ఇలా..

  •     రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ ఎం.హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా నియమించారు. సిరిసిల్ల కలెక్టర్‌గా గరిమా అగర్వాల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 
  •     ఈవీ నర్సింహారెడ్డిని మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
  •     మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీవుల్లాకు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా, క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు ఇచ్చారు.
  •     తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి అండ్ సీఈవోగా నిర్మలా కాంతి వెస్లీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. 
  •     వికారాబాద్ అడిషనల్ కలెక్టర్‌ జి.లింగ్యా నాయక్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియమించారు. 
  •     ఎస్సీ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా డి.హన్మంతు నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 
  •     యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ జి. వీరారెడ్డిని టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. 
  •     ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రాకు పరిశ్రమల శాఖ అదనపు సీఈవోగా బాధ్యతలు అప్పగించారు.