కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!..కీలకంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం

కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!..కీలకంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
  • నందకుమార్ కాల్​ రికార్డింగ్స్​ను నాడు ప్రెస్‌‌మీట్‌‌లో వెల్లడించిన కేసీఆర్​
  • ఇవే ఆధారాలతో సిట్​ దర్యాప్తు.. కేసీఆర్​కు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు
  • ఆడియో రికార్డింగ్‌‌ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో సిట్ ఆరా
  • నాడు బీజేపీ నేతలను ఇరికించబోయి ఇప్పుడు ఇరుక్కున్న బీఆర్ఎస్​ చీఫ్!​
  • నందకుమార్​ స్టేట్​మెంట్​ రికార్డు 
  • ముగిసిన ప్రభాకర్‌‌‌‌ రావు కస్టోడియల్‌‌ విచారణ
  • సిట్‌‌ చీఫ్ సజ్జనార్‌‌‌‌, ఇంటెలిజెన్స్‌‌ చీఫ్‌‌ విజయ్‌‌కుమార్ కీలక భేటీ
  • కేసు పురోగతిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక
  • ఈ నెల 29న సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్ట్‌‌ దాఖలు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో కీలకంగా మారింది. తమ  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్లాన్​ చేశారంటూ అప్పట్లో సీఎం హోదాలో కేసీఆర్‌‌ పెట్టిన  ప్రెస్‌‌మీట్‌‌,‌‌ రిలీజ్ చేసిన ట్యాపింగ్‌‌ ఆడియో రికార్డులను ఆధారంగా చేసుకొని ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిట్‌‌ ముందుకెళ్తున్నది. ఆడియో రికార్డులు ఎవరిచ్చారు.. ఎలా రికార్డ్​ చేశారనే కోణంలో వివరాలు రాబట్టనున్నట్లు  సమాచారం.

ఈ క్రమంలోనే ఫోన్​ ట్యాపింగ్​ కేసు నిందితులు ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, రాధాకిషన్ రావు సహా ఇతరులు  ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ల ఆధారంగా.. ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా అంతిమ లబ్ధి ఎవరికి చేకూరిందనే వివరాలను కేసీఆర్​ద్వారానే రాబట్టాలని సిట్​ భావిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్కన్ కిచెన్‌‌‌‌‌‌‌‌ యజమాని నందకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గురువారం సిట్‌‌‌‌‌‌‌‌ విచారించింది. ఆయన స్టేట్​మెంట్​ను రికార్డు చేసింది. నందకుమార్ ఫోన్​ను ట్యాప్​ చేయడం ద్వారానే ‘ఎమ్మెల్యే కొనుగోలు’ వ్యవహారాన్ని నాడు కేసీఆర్​ గుర్తించినట్లు సిట్​ భావిస్తున్నది. అప్పట్లో సీఎం హోదాలో కేసీఆర్  పెట్టిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌ సహా మీడియాలో ప్రసారమైన ఆడియో, వీడియో రికార్డులను సిట్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే సేకరించింది. వీటి ఆధారంగానే కేసీఆర్, హరీశ్​రావు సహా పలువురికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. కాగా, నాడు బీజేపీ నేతలను ఇరికించేందుకు ఆడియో టేపులను బయటపెట్టిన బీఆర్ఎస్​ అధినేతకు ఇప్పుడు ఆ ఆధారాలే చిక్కులు తెచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముగిసిన ప్రభాకర్​రావు కస్టోడియల్​ విచారణ 

ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావుకు ‌‌‌‌‌‌‌‌సుప్రీంకోర్టు విధించిన కస్టోడియల్‌‌‌‌‌‌‌‌ విచారణ గురువారం అర్ధరాత్రి వరకు ముగిసింది. ఈ నెల 29న సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్ట్  అందించడంతో పాటు ఫైనల్ చార్జిషీట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసే క్రమంలో నిందితులైన మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌‌‌‌‌‌‌‌ రావు సహా ఓ మీడియా హౌస్​ మాజీ ఎండీ శ్రవణ్‌‌‌‌‌‌‌‌రావును మరోసారి విచారించారు. ప్రభాకర్ రావును ఓ ప్రత్యేక గదిలో ప్రశ్నిస్తుండగా.. మిగతవాళ్లను  విడివిడిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. చార్జిషీట్‌‌‌‌‌‌‌‌, సుప్రీంకోర్టుకు అందించే రిపోర్టులో ఎలాంటి తప్పిదాలు లేకుండా సిట్​ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. నిందితులతో పాటు పలువురు కీలకమైన సాక్షులను జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌లోని సిట్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు పిలిపించారు. వారివారి కన్‌‌‌‌‌‌‌‌ఫెషన్ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్లలో పేర్కొన్న అంశాల ఆధారంగా అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. రిమాండ్ రిపోర్టులు సహా ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లోని అంశాలతో సిట్​ అధికారులు డ్రాఫ్టింగ్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు తెలిసింది.

ప్రభాకర్ రావు వియ్యంకుడు రవీందర్​ను సైతం..!

సంధ్య కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు భూవివాదాలకు సంబంధించి రూ.15 కోట్ల వ్యవహారంలో ప్రభాకర్ రావు నుంచి సిట్​ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రభాకర్ రావు తనను బ్లాక్‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌ చేశారని గతంలో శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు సిట్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. బెదిరించి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు రూ.12 కోట్లు ఎలక్టోరల్‌‌‌‌‌‌‌‌ బాండ్లు రాయించారని ఆయన ఆరోపించారు. కాగా, భూవివాదంలో ప్రభాకర్ రావు వియ్యంకుడు రవీందర్ రావుకు కూడా కొంత డబ్బు చేరిందని శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు సిట్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దర్యాప్తులో భాగంగా రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావును కూడా గురువారం సిట్​ అధికారులు ప్రశ్నించారు.  ప్రభాకర్ రావు పెద్దకుమారుడు నిషాంత్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే పలుమార్లు విచారించారు. నిషాంత్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ వ్యాపారం,పెట్టుబడుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు, నిషాంత్‌‌‌‌‌‌‌‌  బ్యాంక్ అకౌంట్లను సిట్‌‌‌‌‌‌‌‌ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. 

సిట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌, ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ కీలక భేటీ

ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసు పురోగతి, తదుపరి కార్యాచరణకు సంబంధించిన పూర్తి వివరాలతో సిట్‌‌‌‌‌‌‌‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిసింది. ప్రభాకర్ కస్టోడియల్‌‌‌‌‌‌‌‌ విచారణ ముగియడంతో పాటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సిట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ సజ్జనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, సిద్దిపేట సీపీ ఎస్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ సహా సిట్‌‌‌‌‌‌‌‌ సభ్యులు గురువారం భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని కమాండ్‌‌‌‌‌‌‌‌ అండ్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ కీలక సమావేశం జరిగింది. ప్రభాకర్ రావు విచారణ సహా కేసు పురోగతికి సంబంధించిన నివేదికను సిద్ధం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దాఖలు చేయాల్సిన స్టేటస్‌‌‌‌‌‌‌‌ రిపోర్టు సహా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విచారణకు పిలిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయనే అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం.