గ్రేటర్ హైదరాబాద్‌ లో మరో ఉప ఎన్నిక?

 గ్రేటర్ హైదరాబాద్‌ లో మరో ఉప ఎన్నిక?
  •     రాజీనామా బాటలో దానం
  •     తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని ప్రకటించడం ద్వారా సంకేతాలు
  •     ఖైరతాబాద్​లో ఉప ఎన్నిక రాబోతోందనే చర్చ

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో మరో ఉప ఎన్నిక రాబోతోందా? పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ త్వరలో రాజీనామా చేయనున్నారా? తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని ప్రకటించడం ద్వారా ఈ మేరకు సంకేతాలు ఇస్తున్నారా? అంటే కాంగ్రెస్​ వర్గాలు అవుననే అంటున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్​ టికెట్​పై పోటీచేశారు. ఎంపీగా ఓడిపోవడంతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 

ఇలా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్​లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు అనర్హత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ట్రిబ్యునల్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్.. వీరందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. దానం మినహా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు స్పందించారు. వీరిలో ఎనిమిది మంది స్పీకర్ సమక్షంలో విచారణకు హాజరై.. తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. అందుకు తగిన ఆధారాలను అందజేశారు. ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. మరో ముగ్గురిపై త్వరలో తీర్పు వెలువడనుంది. 

ఇక తొమ్మిదో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తాను బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకోలేదని స్పీకర్ కు పంపిన అఫిడవిట్ లో స్పష్టం చేశారు. పదో ఎమ్మెల్యే అయిన దానం మాత్రం తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత కేసు ముగింపు దశకు చేరుకున్న సమయంలో దానం ఇలాంటి ప్రకటన చేయడం కొత్త చర్చకు తెరలేపినట్లయింది. ఈ స్టేట్​మెంట్​ను స్పీకర్ సుమోటోగా తీసుకొని దానం సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ ​చేస్తున్నారు.

ఈ నెల 29 తర్వాత రాజీనామా?

తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని ప్రకటిస్తే స్పీకర్​వేటు వేసే అవకాశం ఉందని తెలిసే దానం నాగేందర్​ఇలాంటి కామెంట్స్​చేయడం ద్వారా ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున ఈ సెషన్ తర్వాత దానం రాజీనామా చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. 

కాంగ్రెస్​వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఈ నెల చివర్లో గానీ, జనవరి మొదట్లో గానీ దానం రాజీనామా చేస్తే వచ్చే ఏడాది మార్చి నుంచి మే లోపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో గానీ, లేదంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో గానీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశముందని అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రేటర్ పరిధిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​మరణాలతో ఈ రెండుచోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ  రెండు బీఆర్ఎస్ ​స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. 

ఇదే ఊపుతో ఖైరతాబాద్ నూ గెల్చుకోవాలనేది అధికార పార్టీ ఆలోచనగా కనిపిస్తున్నది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్​ఒక్కరే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరారు అనేందుకు పక్కా ఆధారాలున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ సికింద్రాబాద్​పార్లమెంట్​స్థానానికి కాంగ్రెస్ టికెట్​పై పోటీచేయడమే ఇందుకు కారణం. 

హైకమాండ్ దృష్టికి ఇదే విషయం తీసుకెళ్లారని, అక్కడి నుంచి గ్రీన్​సిగ్నల్​రాగానే రాజీనామా చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని అటు బీఆర్ఎస్, బీజేపీ పదే పదే సవాళ్లు విసురుతున్నాయి. దీంతో దానంతో రాజీనామా చేయించి, గెలవడం ద్వారా ఆ సవాళ్లకు చెక్​పెట్టాలని పార్టీ హైకమాండ్​కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గ్రేటర్​హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్​కు ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తున్నది.