2026లో రిటైల్ జిగేల్..25 శాతం వార్షిక వృద్ధికి అవకాశం

2026లో రిటైల్ జిగేల్..25 శాతం వార్షిక వృద్ధికి అవకాశం
  •     25 శాతం వార్షిక వృద్ధికి అవకాశం
  •     ట్రేడ్​ ఎక్స్​పర్టుల అంచనా

న్యూఢిల్లీ: మనదేశ రిటైల్ రంగం 2026లో మరింత వృద్ధిని సాధించేందుకు సిద్ధమవుతోంది. డిమాండ్​ మెట్రో నగరాల నుంచి టైర్​ 2, టైర్​ 3 పట్టణాలకు  మారుతుండటంతో మంచి లాభాలు వస్తాయని పరిశ్రమ ఆశిస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద రిటైల్ మార్కెట్​గా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. భారత రిటైల్ పరిశ్రమ విలువ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరింది.  డెలాయిట్ ఇండియా వంటి సంస్థల అంచనాల ప్రకారం 2026లో ఈ రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేయనుంది. ఈ లెక్కన 2026 డిసెంబరు నాటికి ఈ పరిశ్రమ విలువ సుమారు 1.2 నుంచి 1.3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు పెరగడం, చిన్న పట్టణాలకు విస్తరణ, పెద్ద ఎత్తున మాల్స్ అభివృద్ధి ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్, టెక్నాలజీతో కూడిన మార్పులు ఈ రంగానికి కీలకం.  జీఎస్​టీ సంస్కరణలు, ఆదాయపు పన్ను తగ్గింపు వంటి ప్రభుత్వ నిర్ణయాలతో పాటు మంచి వర్షపాతం, అధిక ఎంఎస్​పీ వంటి అంశాలు వినియోగదారుల డిమాండ్ పెంచుతాయని పరిశ్రమ భావిస్తోంది. తక్కువ ధరలకు లభించే వాల్యూ రిటైల్ విభాగం, ప్రీమియమైజేషన్ ట్రెండ్స్ వృద్ధిని మరింత వేగవంతం చేస్తాయి.  

సవాళ్లూ ఉన్నాయ్​..

పెరుగుతున్న అద్దెలు, డిజిటల్, ఫిజికల్ విభాగాల మధ్య తీవ్రమైన పోటీ, సరఫరా గొలుసులో ఇబ్బందులు, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత వంటి సవాళ్లు రిటైల్​ రంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.  యాక్సెంచర్ స్ట్రాటజీ అండ్ కన్సల్టింగ్ ఎండీ అండ్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్ ఆదిత్య ప్రియదర్శన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ, 2026లో వృద్ధి పరిమాణం కంటే, మార్జిన్ల పైనే ఆధారపడి ఉంటుందని, ఏఐ టెక్నాలజీను వాడే రిటైలర్లు ముందుంటారని  పేర్కొన్నారు. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్ కూడా 2026లో రిటైల్ రంగం స్థిరమైన వేగంతో ముందుకు సాగుతుందని  అభిప్రాయపడ్డారు. వినియోగదారులు ప్రస్తుతం నాణ్యత, విలువకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన చెప్పారు. 2025లో బ్రాండెడ్ రిటైల్ రంగం ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, వాల్యూ రిటైలర్లు మెరుగ్గా పనిచేశారని వీ మార్ట్ ఎండీ లలిత్ అగర్వాల్ చెప్పారు. జీఎస్​టీ మార్పుల వల్ల పాత స్టాక్​ను తక్కువ ధరలకు అమ్మాల్సి వచ్చిందని, అయితే 2026లో వస్త్రాలు, ఫ్యాషన్ విభాగాల్లో వినియోగం పెరగడం వల్ల వృద్ధి కనిపించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.