కే4 మిసైల్ పరీక్ష సక్సెస్

కే4 మిసైల్ పరీక్ష సక్సెస్

  న్యూఢిల్లీ:  అణ్వాయుధ సామర్థ్యం గల కే4 మిసైల్ ను రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. న్యూక్లియర్ సబ్  మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి ఈ క్షిపణిని టెస్ట్  చేశారు. విశాఖపట్నం వద్ద బంగాళాఖాతంలో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆపరేషనల్ కంట్రోల్ పర్యవేక్షణలో క్షిపణి పరీక్ష జరిగింది. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. కే4 మిసైల్  శ్రేణిలో ఇది రెండో పరీక్ష. నిరుడు ఐఎన్ఎస్  అరిఘాత్  జలాంతర్గామి నుంచే మొదటి కే4 మిసైల్ ను పరీక్షించారు.

 రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. సాలిడ్ ఫ్యుయెల్ తో ఇది పనిచేస్తుంది. న్యూక్లియర్  శక్తితో నడిచే సబ్  మెరెన్స్  నుంచి ఈ మిసైల్స్ ను ప్రయోగిస్తారు. కాగా.. ఐఎన్ఎస్  అరిఘాత్ ను నిరుడు 2024లో భారత నేవీలో కమిషన్  (చేర్చడం) చేశారు. ఇది లేటెస్ట్  న్యూక్లియర్  పవర్డ్  జలాంతర్గామి. తాజా కే4 క్షిపణి పరీక్షతో దేశ రక్షణ సామర్థ్యం మరింత పెరిగినట్లయింది. అంతకుముందు ఐఎన్ఎస్  అరిహంత్  నుంచి కే15 మిసైల్స్ ను పరీక్షించారు. దాని పరిధి 750  కిలోమీటర్లు. 2016లో ఐఎన్ఎస్  అరిహంత్ ను నేవీలో చేర్చారు. ఇప్పుడు ఐఎన్ఎస్  అరిఘాత్  సబ్ మెరైన్  నుంచి మిసైళ్లను ప్రయోగించే స్థాయికి ఎదిగామని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో జలాంతర్గాముల నుంచి మిసైళ్లను ప్రయోగించే రష్యా, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్  చేరిందని ఆ వర్గాలు తెలిపాయి.