- నిషేధాన్ని సడలించిన కేంద్రం
న్యూఢిల్లీ: సైనికులు సోషల్ మీడియా వాడటంపై నిషేధాన్ని కేంద్రం సడలించింది. ఇకపై సైనికులు, సైనికాధికారులు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌పామ్స్ వాడొచ్చని చెప్పింది. అయితే, పోస్ట్ చేయడం, కామెంట్ చేయడంపై నిషేధం విధించింది. సోషల్ మీడియా చూడటం అనేది పర్యవేక్షణ, పరిస్థితుల అవగాహన కోసమేనని, పోస్టులు చేయొద్దని.. పోస్టులకు రిప్లయ్ ఇవ్వొద్దని కండిషన్ పెట్టింది. ఇతర డిజిటల్ కార్యకలాపాలపై ఉన్న నియమాలు ఎప్పటిలాగే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గురువారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్ సూచనలను జారీ చేసింది.
ఏ యాప్‌ను ఎలా వాడాలంటే..
కొత్త పాలసీ ప్రకారం సోషల్ మీడియాను ఎలా వాడాలనే విషయాలను సైన్యం డివైడ్ చేసింది. ఇన్‌స్టాను చూడటానికి మాత్రమే వాడాలి. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్ లో తెలిసిన వ్యక్తులతోనే చాటింగ్ చేయాలి. రహస్య విషయాలు చర్చించొద్దు. ఇక, యూట్యూబ్, ఎక్స్, కోరాను ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఉపయోగించాలి. సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేయొద్దు. చూసినవాటిని షేర్ చేయొద్దు. ఉద్యోగ సమాచారం కోసం, రెజ్యూమేల అప్‌లోడ్ కోసం లింక్డ్ఇన్ వాడొచ్చు. కాగా, 2019 వరకు సైన్యం, సిబ్బంది ఏ సోషల్ మీడియాలోనూ ఉండకూడదనే రూల్స్ ఉండేవి. 2020లో సోషల్ మీడియా దుర్వినియోగ ఘటనల కారణంగా రూల్స్ మరింత కఠినతరం చేసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాతో సహా 89 యాప్‌లు డిలీట్ చేయాలని ఆదేశించారు. తాజాగా ఆ రూల్స్‌ను కాస్త సడలించారు.
