- ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్
- మరో ఐదుగురు మావోయిస్టులు కూడా.. వీరిలో ఇద్దరు మహిళలు
- గణేశ్‌ది నల్గొండ జిల్లా.. 45 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం
- ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు
భద్రాచలం, వెలుగు: మావోయిస్టు పార్టీకి చెందిన మరో కీలక నేత చనిపోయారు. ఒడిశాలోని కందమాల్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ పాక హన్మంతు అలియాస్ గణేశ్ఉయికే (69) మృతి చెందారు. ఆయనతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కందమాల్, గంజాం జిల్లాల సరిహద్దుల్లోని రంబా అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో 20 స్పెషల్ఆపరేషన్ గ్రూప్(ఎస్‌వోజీ), రెండు సీఆర్పీఎఫ్, ఒక్క బీఎస్ఎఫ్గ్రూపులను గురువారం కూంబింగ్‌కు పంపించినట్టు డీఐజీ (ఆపరేషన్స్) అఖిలేశ్వర్ సింగ్ తెలిపారు. ‘‘ఉదయం 9 గంటల సమయంలో కూంబింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లాయి. అనంతరం వేర్వేరు చోట్ల ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఒక 303 రైఫిల్, ఏకే-47, ఇతర పేలుడు పదార్థాలను కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి” అని వెల్లడించారు. చనిపోయినోళ్లలో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత పాక హన్మంతు అలియాస్ గణేశ్ ఉయికే ఉన్నట్టు ప్రకటించారు. ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు ఉందని చెప్పారు. రాజేశ్ తివారీ, రూప అనే మరో ఇద్దరు మావోయిస్టులను కూడా గుర్తించామని.. మిగతా వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. కాగా, 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరోసారి పునరుద్ఘాటించారు. ఎన్‌కౌంటర్ అనంతరం ఆయన ట్వీట్‌చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు.
గణేశ్‌ది.. సుదీర్ఘ ఉద్యమ చరిత్ర
నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక హన్మంతు అలియాస్ గణేశ్ ఉయికే.. చండూరులో పదో తరగతి పూర్తి చేశారు. నల్గొండలో ఇంటర్, డిగ్రీ చదివారు. డిగ్రీలో ఉండగా రాడికల్ స్టూడెంట్స్యూనియన్లో చేరారు. హన్మంతు తల్లిదండ్రులు చంద్రయ్య, పాపమ్మ. ఆయన తండ్రి సీపీఎంలో పనిచేసేవారు. హన్మంతు 45 ఏండ్ల కింద ఏచూరి శ్రీనివాస్ హత్య కేసులో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత నాటి పీపుల్స్ వార్‌లో చేరి దండకారణ్యం బాటపట్టారు. ఎక్కువ కాలం దండకారణ్యం స్పెషల్ జోనల్‌కమిటీ మెంబర్‌గా పనిచేసి, తర్వాత ఒడిశాకు బదిలీ అయ్యారు. అనేక ఆపరేషన్లకు నేతృత్వం వహించిన ఆయన.. కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగారు.
గణేశ్ సొంతూరులో విషాదం..
నల్గొండ, వెలుగు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు అలియాస్ గణేశ్ మృతితో ఆయన సొంతూరు నల్గొండ జిల్లా పుల్లెంల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పాక చంద్రయ్య,- పాపమ్మ దంపతులకు ఆరుగురు పిల్లలు కాగా, వారిలో గణేశ్ మొదటివాడు. ఆయనకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. గణేశ్ చనిపోయినట్టు అతని సోదరుడు సత్యం నిర్ధారించారు. 45 ఏండ్ల కింద అజ్ఞాతంలోకి వెళ్లి, అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదని చెప్పారు. తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా గణేశ్ రాలేదని గ్రామస్తులు తెలిపారు. గతంలో చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గణేశ్ చనిపోయినట్టు అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. కానీ ఆ తర్వాత చనిపోయింది గణేశ్ కాదని కుటుంబసభ్యులు, మావోయిస్టు పార్టీ నేతలు ప్రకటించారు.
