- రాష్ట్రానికి 575 టీఎంసీలు రావాల్సి ఉంటే, 299 టీఎంసీలు చాలని గొంతు కోసిండు
- దీనికి జగన్ సాక్ష్యం.. అవసరమైతే ఒప్పందాలు బయటపెడ్తం: బండి సంజయ్
- ఫోన్ ట్యాపింగ్‌లో కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రమేయం ఉంది
- మేం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు
- కేటీఆర్‌కు అహంకారం తగ్గలే.. కేసీఆర్‌పై సీఎం భాష కరెక్ట్ కాదు
- ఇద్దరు, ముగ్గురు రాష్ట్ర మంత్రులు వేల కోట్లు వెనకేస్తున్నరు
- వాళ్ల డేటా తెప్పించుకుంటున్నం.. బాగోతాన్ని బయటపెడ్తం
- కాంగ్రెస్‌లోనే ఉన్నట్లు దానం చెప్తుంటే స్పీకర్ చర్యలేవీ?
- మీడియాతో చిట్‌చాట్‌లో కేంద్రమంత్రి వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కేసీఆరేనని, ఆయనే నంబర్1 ద్రోహి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘575 టీఎంసీలు రావాల్సి ఉంటే, 299 టీఎంసీలు చాలు అని నాడు అంగీకరించింది కేసీఆరే. ఈ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్ లో వైఎస్ జగన్ చెప్పారు. అవసరమైతే ఆనాటి ఒప్పందాలను బయటపెడ్తం” అని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని, అయినా ఆ కుటుంబం తీరుమారడం లేదని, ఇప్పటికైనా మారాలని సూచించారు. కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం స్థాయిలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాష కరెక్ట్ కాదని ఆయన అన్నారు.
గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే అవినీతి వాసనలు గుప్పుమంటున్నాయని.. రేవంత్ రెడ్డి కేబినెట్లోని ఇద్దరు, ముగ్గురు మంత్రులు చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని వేల కోట్లు వెనకేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర మంత్రుల అవినీతిపై కేంద్ర నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నామని, త్వరలోనే వాళ్ల బాగోతాన్ని బయటపెడతామని చెప్పారు. సొంత ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారని, వారు అంతర్గత సమావేశాల్లో అసమ్మతిని వెళ్లగక్కుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే వారంతా తిరగబడే రోజులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కుటుంబమే పెద్ద శని
మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న భాష సరికాదని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలని బండి సంజయ్ సూచించారు. అయితే, తెలంగాణకు కేసీఆర్ కుటుంబం కంటే పెద్ద శని మరొకటి లేదని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక్కో పంచాయతీకి రూ. కోటి ఇవ్వాలి
‘‘ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు ఇస్తామని సీఎం చెప్పడం హాస్యాస్పదం. అదేమైనా బిచ్చమా? ఒక్కో పంచాయతీకి కనీసం రూ.కోటి ఇవ్వాలి” అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి పంచాయతీలకు రూ. 3,005 కోట్లు రాబోతున్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రే ఒప్పుకున్నారని తెలిపారు. కేంద్రం నిధులిస్తున్నా.. మళ్లీ కేంద్రం ఏం ఇచ్చిందని ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.
జీహెచ్ఎంసీలో ఒంటరిగానే పోటీ
వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్‌గా పోటీ చేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ తో కాంగ్రెస్ అంటకాగుతున్నదని, కాంగ్రెస్ కు ఓటేస్తే మజ్లిస్ కు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. ‘‘మజ్లిస్ ముక్త్ భాగ్యనగర్ మా లక్ష్యం” అని తెలిపారు. ‘‘కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ చెప్పినా.. స్పీకర్ ఎందుకు స్పందించడం లేదు? దీన్ని సుమోటాగా తీసుకొని దానంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం బీజేపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.. అక్కడ కాషాయ జెండా ఎగరవేస్తాం” అని ఆయన చెప్పారు. రాజాసింగ్ రాజీనామా అంశంపై స్పందిస్తూ.. ‘‘ఆయన స్వేచ్ఛా జీవి’’ అని వ్యాఖ్యానించారు.
బీఎంఎస్ ఆఫీసు ప్రారంభం
హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో నూతనంగా నిర్మించిన భారతీయ మజ్దూర్ సంఘ్ ఆఫీస్ (దత్తోపంత్ థేంగడి భవన్) ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ మాననీయ సహకార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. కార్మికుల సంక్షేమం, శ్రమ గౌరవాన్ని, సామరస్యతను ప్రతిబింబించే జాతీయ భావజాలాన్ని మరింత బలోపేతం చేసే కేంద్రంగా దత్తోపంత్ థేంగడి భవన్ నిలవాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.
టీవీ సీరియల్లాఫోన్ట్యాపింగ్ కేసు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ టీవీ సీరియల్ ను తలపిస్తున్నదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు ఎంతో మంది జీవితాలను నాశనం చేశారని, ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ ప్రమేయం కచ్చితంగా ఉందన్నారు. ‘‘గతంలో మమ్మల్ని నక్సలైట్ల జాబితాలో చేర్చిన మూర్ఖుడు కేసీఆర్. మేం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ట్యాపింగ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు. ‘‘కాళేశ్వరంలో లక్ష కోట్ల స్కాం జరిగితే కేవలం రూ. 9 వేల కోట్ల అక్రమాలపైనే ఎందుకు విచారణ చేస్తున్నారు?” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
