- ఈ ఏడాది 9.30 శాతం
- రిటర్న్ ఇచ్చిన సెన్సెక్స్
- ఇదే టైమ్‌లో స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 6.68 శాతం డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది లార్జ్‌క్యాప్ షేర్లతో పోలిస్తే చిన్న స్టాక్స్ (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్) ఇన్వెస్టర్లకు పెద్దగా లాభాలను ఇవ్వలేదు. గత రెండు సంవత్సరాలుగా ర్యాలీ చేయడంతో , వీటి వాల్యుయేషన్స్ బాగా పెరిగిపోయాయి. దీంతో ఈ ఏడాది చిన్న స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ బాగా కనిపించింది. 2023–24లో అసాధారణ ర్యాలీ తర్వాత 2025లో మార్కెట్ సాధారణ స్థాయికి వచ్చిందని ఎనలిస్టులు తెలిపారు. ఫలితంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఎక్కువగా పెరగలేదని అన్నారు.
రూపాయి విలువ తగ్గడం, అమెరికా–ఇండియా ట్రేడ్ చర్చలపై అనిశ్చితి, విదేశీ నిధులు వెళ్లిపోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయన్నారు. ఈ ఏడాది జనవరి1 నుంచి డిసెంబర్ 24 మధ్య బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.77శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ 6.68శాతం తగ్గింది. ఇదే టైమ్‌లో బ్లూచిప్ షేర్లకు ప్రాతినిధ్యం వహించే సెన్సెక్స్ మాత్రం 9.3శాతం ఎగబాకింది. 2024లో స్మాల్‌క్యాప్ 29శాతం, మిడ్‌క్యాప్ 26శాతం రాబడులు ఇచ్చాయి. సెన్సెక్స్ ఇచ్చిన 8.8 శాతం రిటర్న్ కంటే ఇది చాలా ఎక్కువ. పెట్టుబడిదారులు నిలకడగా లాభాలు పొందుతున్న లార్జ్‌క్యాప్స్ వైపు ఈ ఏడాది మళ్లారు. వాల్యుయేషన్స్ తగ్గడం, కంపెనీల ఎర్నింగ్స్ మెరుగుపడడం, జీడీపీ నిలకడగా వృద్ధి చెందుతుండడం, లిక్విడిటీ పెరగడంతో 2026లో స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు తెలిపారు.
