10 వేల సంవత్సరాల తర్వాత పేలిన అగ్నిపర్వతం: 12 వేల కిలోమీటర్ల నుంచి ఢిల్లీకి వచ్చి అల్లకల్లోలం చేస్తుంది..!

10 వేల సంవత్సరాల తర్వాత పేలిన అగ్నిపర్వతం: 12 వేల కిలోమీటర్ల నుంచి ఢిల్లీకి వచ్చి అల్లకల్లోలం చేస్తుంది..!

న్యూఢిల్లీ: ఈస్ట్ ఆఫ్రికాలోని ఇథియోపియాలో హేలీ గుబ్బీ అగ్నిపర్వతం బద్దలైంది. దాదాపు 10 వేల ఏండ్ల తర్వాత ఈ వాల్కనో విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం బద్దలు కావడంతో భారీ ఎత్తున బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే బూడిద మేఘాలు రెడ్ సీ మీదుగా ఒమన్, యెమెన్ దేశాలకు విస్తరించాయి. అటు నుంచి క్రమంగా అవి భారత్ వైపు దూసుకొచ్చాయి. 

సోమవారం (నవంబర్ 24) సాయంత్రం 5.30 గంటలకు గుజరాత్‎లోని జామ్​నగర్‎కు చేరుకున్న బూడిద మేఘాలు.. రాత్రి 11 గంటల ప్రాంతంలో దేశ రాజధాని ఢిల్లీకి విస్తరించాయి. ఎర్ర సముద్రం మీదుగా దాదాపు 130 కి.మీ వేగంతో ఇండియా వైపు దూసుకొచ్చాయి. ఎక్కడో12 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇథియోపియా నుంచి ఢిల్లీకి పయనించిన బూడిద మేఘాలు.. ఇప్పటికే వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్న రాజధాని నగరాన్ని మరింత అల్లకల్లోలానికి గురి చేస్తున్నాయి. 

బూడిద మేఘాల ప్రభావంతో ఢిల్లీలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. రాజధానివాసులు ఊపిరి పీల్చుకోవడం కష్టతరంగా మారింది. ఈ యాష్ క్లౌడ్స్ మంగళవారం (నవంబర్ 25) సాయంత్రానికి పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ పర్వత ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. 

అయితే.. బూడిద మేఘాలు ఆకాశంలో 25 వేల నుంచి 45 వేల అడుగుల ఎత్తులో విస్తరించి ఉండటం, బూడిదలో మానవుల ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు ఎక్కువగా లేకపోవడంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వాతావరణ నిపుణులు. మరోవైపు.. బూడిద మేఘాల ప్రభావం దేశంలోని విమాన సర్వీసులపై పడింది. 

యాష్ క్లౌడ్స్ కారణంగా దేశంలోని పలు మార్గాల్లో విమానాలను నడపడం సాధ్యం కాదని, దీంతో ఫ్లైట్లను డైవర్ట్ లేదా క్యాన్సిల్ చేయడం చేస్తున్నామని విమానయాన శాఖ స్పష్టం చేసింది.  కేరళలోని కన్నూరు నుంచి అబుధాబికి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‎ను అహ్మదాబాద్‎కు డైవర్ట్ చేశారు. అలాగే.. ఢిల్లీ నుంచి నడిచే పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి ఎయిర్ లైన్స్ సంస్థలు.