కొనుగోళ్లు షురువై 43 రోజులైనా 40 శాతం ధాన్యం సేకరించలే

కొనుగోళ్లు షురువై 43 రోజులైనా 40 శాతం ధాన్యం సేకరించలే
  • 19  జిల్లాల్లో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
  • 11 జిల్లాల్లో పావు వంతు కూడా కాలే
  • 6,762 సెంటర్లలో 852 క్లోజ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు షురూ అయి 43 రోజులైనా ఇప్పటి వరకు కనీసం సగమైనా కొనుడు పూర్తికాలేదు. ఈ వానాకాలం 1.12 కోట్ల టన్నుల వడ్లు కొనాలని సర్కారు టార్గెట్‌‌‌‌ పెట్టగా ఇప్పటి వరకు 39.38 లక్షల టన్నుల కొనుగోళ్లే  జరిగాయి. ఈ సీజన్‌‌‌‌లో 7,195 సెంటర్లు ఓపెన్‌‌‌‌ చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 6,762 కేంద్రాలు మాత్రమే ఓపెన్‌‌‌‌ చేశారు. వాటిలో 13 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనే వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయని సివిల్‌‌‌‌ సప్లయ్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 20 జిల్లాల్లో నామమాత్రంగానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికీ కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

13శాతం సెంటర్లలోనే కొనుడు కంప్లీట్

రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 6,762 కొనుగోలు సెంటర్లు తెరవగా.. వాటిలో 852 కేంద్రాల్లో మాత్రమే వడ్ల కొనుగోలు పూర్తయింది. నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో అత్యధికంగా 5.47 లక్షల టన్నుల వడ్లు కొన్నరు. ఈ జిల్లాలో 474 సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టగా ఇప్పటి వరకు 106 సెంటర్లలో పూర్తయింది. కామారెడ్డి జిల్లాలో 350 సెంటర్లలో 4.04 లక్షల టన్నుల వడ్లు సేకరించారు. 86 సెంటర్లలో మాత్రమే సేకరణ పూర్తయింది. మెదక్‌‌‌‌ జిల్లాలో 410 సెంటర్లలో 3.44 లక్షల టన్నుల వడ్లు కొనగా 194 సెంటర్లలో కొనుగోళ్లు పూర్తయ్యాయి. నల్గొండ జిల్లాలో 267 సెంటర్లు తెరిచి, 3.32 లక్షల టన్నుల వడ్లు కొన్నారు. ఆ జిల్లాలో 57 సెంటర్లను క్లోజ్‌‌‌‌  చేశారు. యాదాద్రిలో 305 సెంటర్లలో 2.50 లక్షల టన్నుల వడ్లు కొనగా 119 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. 19 జిల్లాల్లో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 

11 జిల్లాల్లో పావు వంతు కూడా కొనలే

వరంగల్‌‌‌‌, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్‌‌‌‌, ములుగు, ఖమ్మం, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో పావు వంతు వడ్లు కూడా కొనలేదు. పెద్దపల్లి, హనుమకొండ, యాదాద్రి, సూర్యాపేట, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్‌‌‌‌, మంచిర్యాల, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, నల్గొండ జిల్లాల్లో సగం కొనుగోళ్లు కూడా జరగలేదు. అత్యధికంగా నిజామాబాద్‌‌‌‌, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనే  కొనుగోళ్లు జరిగాయి.