
- ఎప్పటికప్పుడు వాయిదాపడుతున్న పీసీసీ కార్యవర్గం
- పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికలు లేక వేలాది పదవులు దూరం
- ద్వితీయ శ్రేణి లీడర్లు, సీనియర్ కార్యకర్తలు నారాజ్
- ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకపోవడానికి కారణం ఇదే !
- ‘జై బాపు, జై భీం, జై సంవిధాన్’ కార్యక్రమానికి స్పందన అంతంతే
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ క్యాడర్లో జోష్ తగ్గుతున్నది. పదేండ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో మొదట్లో కనిపించిన ఉత్సాహం క్రమంగా నీరుగారుతున్నట్టు కనిపిస్తున్నది. తొలి ఏడాదిలోనే ఆరు గ్యారంటీల అమలుతోపాటు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసినా, 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా, ధరణి స్థానంలో భూభారతి తెచ్చినా, కులగణన చేసి, ఎస్సీ వర్గీకరణ చట్టం చేసినా, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నా, సన్నబియ్యం, రాజీవ్ యువ వికాసం లాంటి కొత్త కొత్త స్కీమ్స్‌ను ప్రారంభిస్తున్నా ఆ మేరకు జనంలో మైలేజ్ రాకపోవడానికి కేడర్‌లో నిస్తేజమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.
నిజానికి పదేండ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో అన్ని స్థాయిల్లోనూ నేతలు, సీనియర్ కార్యకర్తలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్, పార్టీ పోస్టులతో పాటు పంచాయతీ, లోకల్‌బాడీ ఎన్నికలు జరిగితే సర్పంచ్ మొదలుకొని జడ్పీ చైర్మన్ దాకా అనేక పదవులు వస్తాయని ఆశపడ్డారు. తీరా ఏడాదిన్నర గడిచినా పదవుల జాడ లేకపోవడంతో కేడర్‌లో తీవ్ర నిరుత్సాహం నెలకొందని, అందువల్లే ప్రభుత్వం చేపడ్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అనుకున్నంతగా జనాల్లోకి వెళ్లడం లేదంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపునిచ్చిన ‘జై బాపు, జై భీం, జై సంవిధాన్’ ప్రోగ్రామ్‌లో కేడర్ చురుగ్గా పాల్గొనకపోవడానికి అసలు కారణం ఇదే అంటున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్తున్నారు.
నామినేటెడ్, పార్టీ పదవులు పెండింగ్..
రాష్ట్రంలో కీలకమైన ఆర్టీసీ, సివిల్ సప్లయ్, రెడ్కో, మూసీ రివర్ ఫ్రంట్ వంటి నామినేటెడ్ పోస్టులతోపాటు పలు జిల్లాల్లో మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, నగరాభివృద్ధి సంస్థ పాలక మండళ్లు, లైబ్రరీ చైర్మన్లు, ఆర్టీఏ మెంబర్ల వంటి వందలాది పదవులను పెండింగ్‌లో పెట్టారు. అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర కాలంలో కేవలం 36 నామినేటెడ్, మరికొన్ని రాజ్యాంగబద్ధమైన పదవులను మాత్రమే భర్తీ చేశారు.
ఇక పీసీసీ కార్యవర్గ ప్రకటన రేపు, మాపు అంటూ నెలలు గడుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం జరిగి 9 నెలలు కావస్తున్నా.. ఇప్పటి వరకు పార్టీ కార్యవర్గాన్ని నియమించలేదు. దీనిపై పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇక డీసీసీ పదవుల ప్రస్తావనే లేదు. దీంతో జిల్లాస్థాయి నేతల్లో నిస్తేజం నెలకొన్నది. మంత్రివర్గ విస్తరణ పదే పదే వాయిదా పడడం కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది.
మొత్తం 18 పదవులకుగాను సీఎంతో సహా 12 మందికి కేబినెట్లో చోటు దక్కింది. మరో 6 మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. కానీ, సామాజిక సమీకరణలు కుదరడం లేదంటూ ఎప్పటికప్పుడు కేబినెట్ విస్తర ణ వాయిదా వేస్తూ వస్తున్నారు. వీటితోపాటు అసెంబ్లీలో చీఫ్ విప్ పదవి, మండలిలో విప్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. పదేండ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడి పార్టీని కాపాడితే.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏడాదిన్నరగా పదవుల కోసం ఎదురు చూడాల్సి రావడం నిజంగా దురదృష్టకరమని ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.
ఊసేలేని లోకల్ బాడీ ఎన్నికలు..
పంచాయతీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎలక్షన్స్ జరగకపోవడం, ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో పార్టీ కేడర్‌కు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తమవుతున్నది. ఈ ఎన్నికలు జరిగితే వేలాది మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, మండల, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, చైర్మన్లు, మేయర్లుగా వివిధ పదవుల్లో ఉండేవారు.
దీంతో వీరంతా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించేవారు. నిజానికి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఆరు గ్యారంటీల్లో చాలా హామీలను అమలుచేసింది. 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్, రూ.500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ లాంటివి అమలుచేస్తున్నది. రూ.21వేల కోట్ల రుణమాఫీ చేయడం ద్వారా రికార్డు సృష్టించింది.
గత సర్కారు, నిరుద్యోగులను పూర్తి నిర్లక్ష్యం చేయగా, కాంగ్రెస్ సర్కారు వచ్చాక 60వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు త్వరలో మరో 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నది. దీంతోపాటు నిరుద్యోగుల ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం లాంటి స్కీమ్‌ను కూడా ప్రారంభించింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని సైతం స్పీడప్ చేసింది. రైతుల కష్టాలకు కారణమవుతున్న ధరణి స్థానంలో కొత్తగా భూభారతి చట్టాన్ని తెచ్చింది. పదేండ్లపాటు పెండింగ్‌లో పడ్డ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడమేగాక దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది.
ఇంతేకాదు, కీలకమైన బీసీ కులగణన చేయడంతోపాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను శాసనసభలో ఆమోదం తెలిపింది. ఏండ్లుగా పెండింగ్పడిన ఎస్సీవర్గీకరణ చట్టం చేసి అమల్లోకి తెచ్చింది. ఇంత చేస్తున్నా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ సర్కారుకు ఆశించినంత మైలేజీ రావడం లేదు. ప్రభుత్వం చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కేడర్‌లో నిరుత్సాహమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తమ పదవుల సంగతేమిటంటూ నియోజకవర్గాలకు వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తున్నారు.
హైకమాండ్ పిలుపునిచ్చినా..
కాంగ్రెస్ హైకమాండ్ పిలుపునిచ్చిన ‘జై బాపు, జై భీం, జై సంవిధాన్’ ప్రోగ్రామ్‌లో కూడా పార్టీ కేడర్ చురుగ్గా పాల్గొనడం లేదు. ఈ ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, కులగణన వంటి పథకాల ను ఇంటింటికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పార్టీ మీటింగ్ లలో కేడర్‌ను కోరినా.. వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ఇప్పటికైనా ప్రభుత్వం, పీసీసీ నాయకత్వం.. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, పదవుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, లేదంటే మున్ముందు కాంగ్రెస్‌కు ప్రతికూల వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.