- కొత్త కార్పొరేషన్లకు అప్పుల పంపకానికి నో
- రూ.4,876 కోట్లు చెల్లించనున్న సర్కారు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ అప్పు రూ.4,876 కోట్లను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. మూడు కార్పొరేషన్లుగా మారిన తర్వాత అప్పులను పంచేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు అప్పులు పంచితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ప్రభుత్వం పూర్తి అప్పులను చెల్లించేందుకు సిద్ధంగా ఉందని మున్సిప ల్ అధికారులు చెప్తున్నారు.
2014 నుంచి హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, నాలాలను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ రూ.6,530 కోట్ల అప్పులు చేసింది. దీనికి సంబంధించి రెండేండ్లుగా ప్రతినెలా రూ.100 కోట్ల అప్పుతో పాటు వడ్డీలను కూడా కడుతున్నది. అయితే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నుంచి జీహెచ్ఎంసీకి మ్యూటేషన్ బకాయిలు రూ.2,500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ భవనాల ప్రాపర్టీ ట్యాక్స్ రూ.5,500 కోట్లు రావాల్సి ఉంది. వీటి స్థానం లో బల్దియా అప్పులను తీరిస్తే మూడు కార్పొరేషన్లకు ఆర్థికంగా ఇబ్బంది ఉండవని అధికారులంటున్నారు.
జీహెచ్ఎంసీ అప్పులు ఇలా
జీహెచ్ఎంసీ ఇప్పటికే వివిధ పనులకోసం ఎస్బీఐ నుంచి రూ.6,530 కోట్ల అప్పు తీసుకుంది. ఎస్ఆర్ డీపీ కోసం రూ.4,250 కోట్లు, సీఆర్ఎంపీ కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1,460 కోట్లు, ఎస్ఎన్డీపీ కోసం రూ.680 కోట్లని 7.20 శాతం వడ్డీతో తీసు కుంది. జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్లకోసం రూ.140 కోట్ల హడ్కో లోన్ సేకరించింది.
ఇందులో రూ.100 కోట్లను 8.90 శాతం వడ్డీతో, రూ.40 కోట్లను 9.90 శాతం వడ్డీతో తీసుకుంది. వీటికి సంబంధించిన బకా యిలు ప్రతి నెల రూ. 100 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. ఇలా ఇప్పటివరకు రూ.1654 కోట్లను తిరిగి చెల్లించింది.
