బండ్లు నడవకపోయినా... వడ్డీలు కట్టాల్సిందే..!

V6 Velugu Posted on Jun 14, 2021

  • క్యాబ్, ఆటో డ్రైవర్లకు పెరిగిన ఫైనాన్షియర్ల వేధింపులు
  • ఈఎంఐలు, కిస్తీలు చెల్లించకపోతే వెహికల్స్​ను గుంజుకపోతున్నరు
  • లాక్ డౌన్ సడలింపుతో తిరుగుతున్న రికవరీ ఏజెంట్లు

‘మలక్ పేట్ కు చెందిన సుల్తాన్ ఆరేండ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతేడాదిలో లాక్ డౌన్ కారణంగా గిరాకీ లేక 4 నెలల ఈఎంఐ కట్టలేకపోయాడు. ఆటో తీసుకెళ్లేందుకు రికవరీ ఏజెంట్లు వచ్చారు. తన  ఉపాధి పోతుందని, కావాలంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తానని ఫైనాన్షియర్ దగ్గర సుల్తాన్ ఒప్పుకున్నాడు. ఇలా పెండింగ్ ఈఎంఐలపై ఫైనాన్షియర్  అదనంగా వడ్డీలు వసూలు చేయడంతో సుల్తాన్ అప్పుల్లో కూరుకుపోయాడు’.

హైదరాబాద్,వెలుగు: కరోనా ఎఫెక్ట్, లాక్​డౌన్​తో క్యాబ్, ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైనయ్. ఈఎంఐలు కట్టలేక, ఇంటి ఖర్చులకు సరిపడా ఆదాయం రాక ఇబ్బందులు పడుతున్నారు. బండ్లను ఫైనాన్షియర్లు గుంజుకోవడంతో ఉన్న ఉపాధిని కోల్పోతున్నారు. ఇక వడ్డీల మీద వడ్డీలకు కడుతూ మరికొందరు అప్పులపాలవుతున్నారు. ఫైనాన్షియర్లు ఇలా ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొందరు ఒత్తడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్ లపై ఆధారపడి సుమారు ఐదున్నర లక్షల మంది డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు. గ్రేటర్ సిటీలోనే లక్షన్నర ఆటోలు, లక్షా 20 వేల క్యాబ్ లు ఉన్నాయి. గతేడాది కరోనా, లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం 60 వేల క్యాబ్ లు, 90 వేల ఆటోలు మాత్రమే గ్రేటర్ పరిధిలో నడుస్తున్నాయి. ఇందులో 90 శాతం వెహికల్స్ ప్రైవేటు ఫైనాన్షియర్లకు కిస్తీలు కడుతున్నవే ఉన్నాయి. కరోనా, లాక్​ డౌన్ ఎఫెక్ట్ తో ఆదాయం లేక ఈఎంఐంలు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే మరోవైపు ఫైనాన్షియర్లు బండ్లను గుంజుకుని పోతున్నారని క్యాబ్ లు, ఆటోల డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్​డౌన్ వల్ల క్యాబ్, ఆటో డ్రైవర్లకు గిరాకీ ఉండదు.  దీన్ని పట్టించుకోకుండా ఈఎంఐలు కట్టకపోతే బండ్లను తీసుకెళ్తామని ఫైనాన్షియర్లు వేధిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఫైనాన్షియర్ల వేధింపులు, దోపిడీ ఎక్కువగా ఉన్నట్లు ఆటో సంఘాల నాయకులు చెప్తున్నారు. ఒక్క ఈఎంఐ కట్టకపోయినా, బండ్లు గుంజుకుపోతామంటూ బెదిరిస్తున్నట్లు తెలిపారు.  

అందని ఆర్థిక సాయం
క్యాబ్, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందట్లేదు. కనీసం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేంత వరకు కనీసం ఫైనాన్షియర్ల వేధింపులను  ప్రభుత్వం ఆపలేకపోయిందని, అధిక వడ్డీలు వసూలు చేయొద్దని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని  క్యాబ్, ఆటో డ్రైవర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేరళలో ఆటో డ్రైవర్లకు రూ. 7,500 ఇస్తుండగా, కర్ణాటక, ఒడిశా లాంటి రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇప్పటికే తెలంగాణలో ప్రైవేటు టీచర్లకు ఇస్తున్నట్లుగా తమకు సాయం చేయాలని క్యాబ్, ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. కనీసం కరోనా కేసులు తగ్గి, క్యాబ్​లకు పూర్తిస్థాయిలో గిరాకీ వచ్చేవరకైనా బండ్లను సీజ్ చేయకుండా ఫైనాన్షియర్లకు ఆదేశాలివ్వాలంటున్నారు. 

3 నెలల్లో వెయ్యికి పైగా ఆటోలు పట్టుకుపోయిన్రు
3 నెలల్లో గ్రేటర్ పరిధిలో 576 క్యాబ్ లు, వెయ్యికి పైగా ఆటోలను కిస్తీలు కట్టలేదని ఫైనాన్షియర్లు  తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సిటీలో ఇప్పటివరకు నలుగురు క్యాబ్ డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారు. మరోవైపు కరోనా బారిన పడి ట్రీట్ మెంట్ కోసం డబ్బుల్లేక అప్పులు చేసిన కుటుంబాలున్నాయని క్యాబ్ డ్రైవర్ సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. కొందరు క్యాబ్ డ్రైవర్లు ఉపాధి లేక కూరగాయలు అమ్ముతుంటే, మరికొందరు సొంతూళ్లకు వెళ్లిపోయారన్నారు.  నేరెడ్ మెట్ కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ నెలరోజుల క్రితం కరోనాతో చనిపోయాడు. ఈఎంఐ కట్టేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు అతడి భార్య లక్ష్మి క్యాబ్ లో కూరగాయలు అమ్ముతోంది. లాక్ డౌన్​రిలాక్సేషన్స్ ఇవ్వడంతో అప్పు తీర్చాలని ఫైనాన్షియర్లు వేధిస్తున్నారని ఆమె వాపోయింది.  

 భరోసా లేకపాయే
 కరోనా తర్వాత క్యాబ్ డ్రైవర్లకు భరోసా లేకుండా పోయింది. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం.  ఆర్థిక భారాన్ని మోయలేక అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరోనా సోకిన డ్రైవర్లకు   కంపెనీల నుంచి సాయం అందట్లేదు. డ్రైవింగ్ చేస్తే గానీ పూట గడవని డ్రైవర్లను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. కనీసం ఈఎంఐల రద్దు, ఉద్యోగ భద్రత, వైద్య సదుపాయం కల్పించాలి.
‑ సలావుద్దీన్, క్యాబ్  డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్

ఆటో డ్రైవర్లను ఆదుకోవాలె
ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైనయ్. కరోనా ఎఫెక్ట్​కు అప్పులపాలైన్రు.  ఫైనాన్షియర్ల వేధింపులు ఎక్కువైనయ్. ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్​కు రూ. 5వేలు, రేషన్ సరుకులు అందించాలి. 6 నెలల కాల వ్యవధిలో కిస్తీలు కట్టేందుకు గడువు ఇవ్వాలి. చనిపోయిన డ్రైవర్లను కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి.  
‑ ఉమర్ ఖాన్, ఆటో డ్రైవర్ యూనియన్, సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్

Tagged Hyderabad, lockdown, Banks, Loans, EMI, autos, cabs, financiers

Latest Videos

Subscribe Now

More News