
- పర్‌ఫెక్ట్ పాండ్యా
- బ్యాట్, బాల్‌తో అదరగొడుతున్న హార్దిక్
- రీఎంట్రీ తర్వాత ప్రశాంతంగా పని కానిస్తున్న ఆల్‌రౌండర్
సరిగ్గా నాలుగేండ్ల కిందట ఆసియా కప్ (వన్డే ఫార్మాట్)లో ఇండియా‑పాకిస్థాన్ మధ్య మ్యాచ్. ఓ ప్లేయర్ బౌలింగ్ చేస్తూ వెన్ను గాయానికి గురై కింద పడిపోయాడు. నొప్పితో విలవిల్లాడిన అతడిని స్ట్రెచర్‌పై బయటికి తీసుకెళ్లారు. అంత పెద్ద గాయం తర్వాత అతను కోలుకొని తిరిగొస్తాడా? వస్తే మళ్లీ బౌలింగ్ చేయగలడా? అది కుదరకపోతే కేవలం బ్యాటర్‌గా జట్టులో స్థానం ఉంటుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలెన్నో వచ్చాయి.
ఇప్పుడు మళ్లీ అదే అసియా కప్‌లో.. అదే దుబాయ్ స్టేడియంలో.. ఇండియా‑పాక్ మ్యాచ్. ముందుగా స్టార్ పేసర్‌ను తలపించే బౌలింగ్‌తో ప్రత్యర్థి వెన్ను విరిచిన అతను తర్వాత బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. ప్రత్యర్థి బౌలర్ల సవాల్‌ను ప్రశాంతంగా ఎదుర్కొని జట్టును గెలిపించి తన దమ్ము చూపెట్టాడు.
ఈ రెండు సందర్భాల్లో ఉన్నది ఒకే వ్యక్తి. తనే ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. 2018లో స్ట్రెచర్‌పై పడుకొని హాస్పిటల్‌కు వెళ్లిన అదే గ్రౌండ్‌లో ఇప్పుడు అద్భుత ఆటతో టీమిండియాకు గుర్తుండిపోయే విజయం అందించాడు. ఒక ఆల్‌రౌండర్‌గా జట్టు తన నుంచి ఏం కోరుకుందో అంతకు మించిన పెర్ఫామెన్స్ చూపెట్టాడు. ప్రశాంతంగా, పర్ఫెక్ట్గా పని కానిస్తున్న పాండ్యా ఇప్పుడు ప్రత్యర్థులకు మరింత ప్రమాదకరం.
‘ఆఖరి ఓవర్లో ఏడు కాదు 15 రన్స్ చేయాల్సి వచ్చినా నేను జట్టును గెలిపించే ప్రయత్నం చేసేవాడిని’ పాక్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ చేసిన కామెంట్ ఇది. దీన్ని బట్టి అతనిలో ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగేళ్ల కిందట ఆసియాకప్‌లో మనం చూసిన పాండ్యా వేరు.. ఇప్పుడు వేరు. గాయాలు, ఎదురుదెబ్బలు అతడిని రాటు దేల్చాయి. తన సామర్థ్యంపై వచ్చిన ప్రశ్నలు, పనైపోయిందని వచ్చిన విమర్శలు పాండ్యాలో కసిని పెంచాయి. ఈ మ్యాచ్‌లో అతని బౌలింగ్ ఓ స్టార్ పేసర్‌ను తలపించింది. నాలుగు వికెట్లతో భువనేశ్వర్ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచినా.. పాకిస్తాన్ నడ్డి విరిచింది మాత్రం పాండ్యానే. పైగా అతను తీసిన మూడు వికెట్లూ షార్ట్ పిచ్ బాల్స్‌కు వచ్చినవే. పక్కా ప్లాన్, పర్‌ఫెక్ట్ లెంగ్త్‌తో నిలకడగా 140 ప్లస్ కి.మీ స్పీడుతో అలాంటి బాల్స్ వేయాలంటే ఎంతో ప్రాక్టీస్ అవసరం. ఎన్నో రోజులు గంటల తరబడి నెట్స్‌లో చెమటలు చిందించడం వల్లే పాండ్యా అలాంటి బాల్స్ వేయగలుగుతున్నాడు.
రోబోలా కష్టపడి
వాస్తవానికి 2018 ఆసియా కప్‌లో గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పాండ్యా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. వెన్నుగాయం తిరగబెడుతుందన్న భయంతో మునపటిలా బౌలింగ్ చేయలేకపోయాడు. దాంతో, గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే జట్టులో ఉండటంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇవి పాండ్యాకు నచ్చలేదు. ఆ మెగా టోర్నీ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్నాడు. కాంపిటీటివ్ క్రికెట్‌కు, సోషల్ మీడియాకు దూరమై తన ఫిట్‌నెస్‌ను పెంచుకున్నాడు. ట్రెయినింగ్, నిద్ర.. రెండే అతని డైలీ రిటీన్ అయ్యాయి. పక్కా షెడ్యూల్ వేసుకొని ఓ రోబోలా కనష్టపడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అతను ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడు? టీమిండియాలోకి ఎప్పుడు తిరిగొస్తాడు? అనే విషయాలపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. ముఖ్యంగా అతని బౌలింగ్ సామర్థ్యం అయితే ఓ మిస్టరీగా మారింది. ఐపీఎల్ కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌గా ఎంపికైనప్పుడు ఇదే ప్రశ్న హార్దిక్ పాండ్యాకు ఎదురైతే ‘అది సీక్రెట్’ అని చెప్పి మరింత సస్పెన్స్ క్రియేట్ చేశాడు.
సర్‌ప్రైజ్ చేస్తున్నాడు
ఈ సీజన్ ఐపీఎల్‌తో తన సామర్థ్యంపై వస్తున్న ప్రశ్నలు, అనుమానాలు అన్నింటికీ పాండ్యా సమాధానం చెప్పాడు. గుజరాత్‌కు టైటిల్ అందించిన హార్దిక్ టాపార్డర్, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. క్లిష్ట సమయాల్లో ఫినిషర్‌గా వచ్చి మ్యాచ్‌లు గెలిపించాడు. అదే సమయంలో ఓ బౌలర్‌గా అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాలా తెలివిగా బంతులు వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. గాయం భయం లేకుండా బ్యాక్‌ను బెండ్ చేస్తూ వైవిధ్యమైన బాల్స్ వేశాడు. ఓ రకంగా తనలోని కొత్త వెర్షన్‌తో సర్‌ప్రైజ్ చేశాడు. ఇప్పుడు మనం ఆసియా కప్‌లో ఆ కొత్త వెర్షన్‌నే చూస్తు న్నాం. ఓ క్లాసిక్ ఫాస్ట్ బౌలర్‌ను తలపించే బౌలింగ్‌తో పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. పాండ్యా పని అక్కడితోనే ముగియలేదు. టార్గెట్ ఛేజింగ్‌లో టాపార్డర్ ఫెయిలైన వేళ అతను ఆపద్భాంద వుడయ్యాడు. గతంలో పాండ్యా క్రీజులో ఉన్నాడంటే ఓవర్‌కో ఫోరో, సిక్సో వచ్చేది. లేదంటే ఔటై తనే వెనక్కి వచ్చేవాడు. కానీ, తన గురువు ఎంఎస్ ధోనీ మాదిరిగా ప్రశాంతంగా క్రీజులో నిల్చున్న పాండ్యా పరిస్థితులను అంచనా వేస్తూ పరుగులు రాబట్టాడు. భారీ షాట్లు కొట్టే సత్తా ఉన్నా.. అవకాశం వచ్చేదాకా ఓపిక పట్టాడు. నసీమ్ షా వేసిన 19వ ఓవర్లో రింగ్ అవతల ముగ్గురు ఫీల్డర్లే ఉండటంతో మూడు ఫోర్లు రాబట్టి ఒత్తిడి తగ్గించాడు. మూడు బాల్స్‌లో ఆరు రన్స్ అవసరం అయినప్పుడు ‘నేను చూసుకుంటా టెన్షన్ పడొద్దు’ అన్నట్టు దినేశ్ కార్తీక్‌కు సంజ్ఞ చేసిన పాండ్యా భారీ సిక్స్ కొట్టాడు. చిరకాల ప్రత్యర్థిపై ఉత్కంఠ విజయం సాధించినా.. గతం లో మాదిరిగా తను గట్టిగా అరవలేదు. గాల్లోకి పంచ్‌లు విసరలేదు. పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. పని పూర్తి చేశా అన్నట్టు టీమిండియా డ్రెస్సింగ్‌రూమ్ వైపు చేయి చూపించాడు ప్రశాంతంగా..! మ్యాచ్ పూర్తయిన తర్వాత 2018 ఆసియా కప్‌లో స్ట్రెచర్‌పై వెళ్తున్న ఫొటో, తాజా మ్యాచ్‌లో గెలిచిన తర్వాత బ్యాట్ ఎత్తిన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన పాండ్యా ‘ఎదురుదెబ్బ కంటే పునరాగమనమే గొప్ప’ అని క్యాప్షన్ ఇచ్చాడు. నిజమే కదా!
ఎప్పుడేం చేయాలో హార్దిక్‌కు బాగా తెలుసు: రోహిత్
గాయం నుంచి కోలుకొని జట్టులోకి తిరిగొచ్చిన తర్వాత హార్దిక్ అద్భుతంగా ఆడుతున్నాడు. జట్టుకు దూరంగా ఉన్న టైమ్‌లో తన బాడీకి ఏం అవసరం? ఫిట్‌నెస్ పెంచుకునేందుకు ఏం చేయాలో అతను తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈజీగా 140 ప్లస్ స్పీడుతో బౌలింగ్ చేస్తున్నాడు. అతని బ్యాటింగ్ క్వాలిటీ గురించి మనందరికీ తెలుసు. రీఎంట్రీ తర్వాత మరింత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తనిప్పుడు చాలా కామ్‌గా ఉంటున్నాడు. బ్యాట్‌తో అయినా బాల్‌తో అయినా తాను ఎప్పుడు ఏం చేయాలనే విషయంపై , కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇంత ఒత్తిడిలో ఓవర్‌కు పది రన్స్ అవసరం అయితే ఎవ్వరైనా భయపడుతారు. కానీ, పాండ్యా ఏమాత్రం భయపడకుండా జట్టును గెలిపించాడు.
ఈ విజయం మాకు చాలా ముఖ్యమైనది. ఈ పోరు మమ్మల్ని పరీక్షించింది. మా జట్టుకు కూడా సవాల్ విసిరింది. జడేజా నాలుగో నంబర్‌లో వచ్చి ఆడిన విధానం బాగుంది. గతంలో ఇదే గ్రౌండ్‌లో నన్ను స్ట్రెచర్‌పై తీసుకెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటున్నా. అలాంటి పరిస్థితి తర్వాత తిరిగి ఈ రోజు గ్రౌండ్‌లోకి వచ్చి జట్టును గెలిపించడం ఏదో సాధించిన గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఈ ప్రయాణం చాలా అందంగా ఉంది. నా రీఎంట్రీకి కారణమైన నితిన్ పటేల్ (బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ హెడ్), సోహం దేశాయ్ (టీమ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్)కే ఈ క్రెడిట్ దక్కుతుంది.
‑ హార్దిక్ పాండ్యా