తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ అభ్యర్థులకు ఈవెంట్స్ షురూ

తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ అభ్యర్థులకు ఈవెంట్స్ షురూ
  • పోలీస్ ఈవెంట్స్ షురూ

  • రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో సెంటర్ల ఏర్పాటు

  • రోజూ 600 నుంచి 1,200 మందికి ఈవెంట్స్‌‌ నిర్వహించేలా ఏర్పాట్లు

  • రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ద్వారా అభ్యర్థుల కదలికలు రికార్డు

  • రూల్స్‌‌ పాటించని క్యాండిడేట్లపై అనర్హత వేటు

హైదరాబాద్, వెలుగు: పోలీస్‌‌ అభ్యర్థులకు గురువారం నుంచి ఈవెంట్స్‌‌ ప్రారంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో ఈవెంట్లు జరుగుతున్నాయి. గ్రౌండ్‌‌ కెపాసిటీని బట్టి రోజూ 600 నుంచి 1,200 మంది అభ్యర్థులకు ఈవెంట్స్‌‌ నిర్వహించేలా టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌‌‌బీ ఏర్పాటు చేసింది. అభ్యర్థుల దగ్గరున్న మొబైల్‌‌ ఫోన్‌‌తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించలేదు. గేట్‌‌లోకి ఎంటరైన దగ్గరి నుంచి ఈవెంట్‌‌ ముగిసే వరకు సీసీటీవీ కెమెరాలతో  అభ్యర్థులపై నిఘా పెట్టారు.

సైబరాబాద్‌‌ కమిషనరేట్ పరిధిలోని కొండాపూర్ 8వ బెటాలియన్‌‌,పేట్లబురుజులోని సిటీ ఆర్మ్ రిజర్వ్‌‌, అంబర్‌‌‌‌పేట్‌‌ సీపీఎల్‌‌ సహా రాచకొండ కమిషనరేట్‌‌లోని సరూర్‌‌‌‌నగర్ స్టేడియంలో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. బయోమెట్రిక్, చేతికి వ్రిస్ట్‌‌ బ్యాండ్‌‌.. ఈవెంట్ జరిగే గ్రౌండ్‌‌లోకి అభ్యర్థి రాగానే బయోమెట్రిక్‌‌ తీసుకుంటున్నారు. ప్రిలిమినరీ నుంచి ఫైనల్‌‌ ఎగ్జామ్స్‌‌ వరకు మొత్తం 9 సార్లు బయోమెట్రిక్ తీసుకుంటారు. ఈవెంట్లలో పాల్గొనే అభ్యర్థుల చేతికి ఎలక్ట్రానిక్‌‌ వ్రిస్ట్‌‌ బ్యాండ్‌‌ ఫిక్స్‌‌ చేశారు. దీంతో అభ్యర్థి కదలికలను చిప్‌‌ ద్వారా రాడార్‌‌లో రికార్డ్ చేస్తున్నారు. వ్రిస్ట్‌‌ బ్యాండ్‌‌ ద్వారా ఆయా అభ్యర్థి పాల్గొన్న ఈవెంట్స్‌‌, ఖాళీగా తిరిగిన సమయాన్ని గుర్తిస్తారు. గ్రౌండ్‌‌లో ఎక్కడెక్కడ తిరిగాడు, వ్రిస్ట్‌‌ బ్యాండ్‌‌ను తీసేసి ఈవెంట్స్‌‌లో పాల్గొన్నాడా అనే వివరాలతో అభ్యర్థికి చెందిన ప్రతి కదలికను డిజిటల్ టెక్నాలజీతో రికార్డ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని అనర్హులుగా గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈవెంట్స్‌‌ను పూర్తిగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ (ఆర్ఎఫ్ఐడీ)తో రికార్డ్ చేశారు. దీని ద్వారా రన్నింగ్‌‌ టైమింగ్‌‌ ఆటోమేటిక్‌‌గా రికార్డ్‌‌ అవుతుంది. ఇందులో క్వాలిఫై అయిన వారిని హైట్‌‌ మెజర్‌‌‌‌మెంట్‌‌కు అనుమతించారు. రన్నింగ్‌‌, హైట్‌‌లో అర్హత సాధించిన వారికే లాంగ్‌‌ జంప్, షాట్‌‌పుట్‌‌ నిర్వహించారు. అన్ని ఈవెంట్స్‌‌లో క్వాలిఫై అయిన వారిని ఫైనల్‌‌ ఎగ్జామ్‌‌కి ఎంపిక చేస్తారు. 

మీడియాకు నో పర్మిషన్‌‌.. 

గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఈసారి అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవెంట్స్‌‌లో ఏమైన సమస్యలు తలెత్తితే బయటపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఈవెంట్స్‌‌ను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాను లోపలికి అనుమతించలేదు. అంబర్‌‌‌‌పేట్‌‌ సీపీఎల్‌‌లో జరిగిన ఈవెంట్స్‌‌ను ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‌‌‌‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా తీసిన ఫొటోలను డిలీట్‌‌ చేయించారు. కొండాపూర్‌‌‌‌ బెటాలియన్‌‌లోనూ మీడియా కవరేజ్‌‌కి అనుమతి ఇవ్వలేదు.