V6 News

నో హెల్మెట్ - నో ఎంట్రీ.. ప్రతి అపార్ట్మెంట్ ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలి: హైదరాబాద్ సీపీ సజ్జనార్

నో హెల్మెట్ - నో ఎంట్రీ.. ప్రతి అపార్ట్మెంట్ ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
  • ఘనంగా ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు

సిటీ నెట్​వర్క్, వెలుగు: గ్రేటర్​లో ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు బుధవార ఘనంగా జరిగాయి. బైక్​లపై ప్రయాణించే నాలుగేళ్లు దాటిన చిన్నారులకు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని వివరిస్తూ, పోలీసులు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. కమాండ్ కంట్రోల్ సెండర్ ఆడిటోరియంలో జరిగిన రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. 

ప్రతి అపార్ట్​మెంట్, కాలనీ అసోసియేషన్లు ‘నో హెల్మెట్ - నో ఎంట్రీ’ నిబంధనను కఠినంగా అమలు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వం ‘రహ్ వీర్’ పథకం ద్వారా నగదు పురస్కారంతో అందిస్తుందని, కాబట్టి ఎవరూ భయపడకుండా బాధితులను ఆదుకోవాలని కోరారు. స్థానిక ట్రాఫిక్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. 

గచ్చిబౌలి కె.ఎల్.హెచ్ యూనివర్సిటీలో జరిగిన సదస్సులో సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ.. యువత సోషల్ మీడియా ట్రెండ్స్ వెంట పడి తమ విలువైన కెరీర్​ను పాడు చేసుకోవద్దన్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు లేదా రోడ్లపై నడిచేటప్పుడు మొబైల్ వినియోగం ప్రాణాంతకమని హెచ్చరించారు. అలాగే బర్కత్​పురా, ఖైరతాబాద్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీ అవినాశ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. అటు విజయ్‌‌‌‌నగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సదస్సులో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని, దీనివల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.