ప్రతి భారతీయుడు ‘కాశ్మీర్​ ఫైల్స్’ చూడాలె

ప్రతి భారతీయుడు ‘కాశ్మీర్​ ఫైల్స్’ చూడాలె
  • దమ్ముంటే  కంటోన్మెంట్​కు 
  • కరెంట్​ కట్​చెయ్ ​చూద్దాం
  • కేటీఆర్​కు బండి సంజయ్ ​హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: కంటోన్మెంట్ కు కరెంట్​, నీళ్లు కట్ చేస్తామన్న మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్  మండిపడ్డారు. ‘దమ్ముంటే కరెంట్ కట్​ చెయ్ చూద్దాం’ అని ఆయన సవాల్ చేశారు. కంటోన్మెంట్​లో ఉండే సైనికులు సిటీకి రక్షణగా ఉంటారని, అలాంటిది కంటోన్మెంట్​ విషయంలో అసెంబ్లీ వేదికగా కేటీఆర్ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.  సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలని, అంతే తప్ప ఇష్టమున్నట్లు మాట్లాడొద్దన్నారు.  సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ తెలంగాణ ద్రోహులే కాదు.. దేశ ద్రోహులు కూడా అని ఆయన ఫైర్​ అయ్యారు. ఆదివారం బంజారాహిల్స్​లోని ప్రసాద్ ల్యాబ్స్​లో ఎమ్మెల్యే  రాజాసింగ్​, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ‘కాశ్మీర్​ ఫైల్స్​’ సినిమాను బండి సంజయ్​ చూశారు.  అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘పాతబస్తీలో ఏండ్ల తరబడి పేరుకుపోయిన కరెంట్ బిల్లులను వసూలు చేయడం చేతగాని దద్దమ్మ.. కంటోన్మెంట్ కు కరెంట్, నీళ్లు కట్ చేస్తమని చెప్పడం సిగ్గు చేటు. నీ పవర్​ను తెలంగాణ పబ్లిక్   కట్ చేసుడు ఖాయం. ఇట్లనే దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తే.. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఉరికించి కొట్టుడు ఖాయం” అని హెచ్చరించారు. కంటోన్మెంట్​పై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్​ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. సైనికుల త్యాగాలను అవమాన పర్చేలా సర్జికల్​ స్ట్రయిక్స్​పై సీఎం కేసీఆర్​ కామెంట్లు చేశారని, ఆయన దేశ సైనికులకు, వీర సైనికుల కుటుంబాలకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సంజయ్​ అన్నారు. యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని, న్యాయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సంజయ్ తెలిపారు. ‘‘కేసీఆర్ ఫాంహౌస్​కు పోతుంటే ఆ ప్రాంతమంతా ట్రాఫిక్,  దుకాణాలు, వ్యాపారాలన్నీ బంద్ చేస్తరు. ఇట్లా చేసుడుతోటి ప్రజలు నానా ఇబ్బందులు పడ్తున్నరు” అని సంజయ్ అన్నారు. 

వాస్తవాలను చూపించిన ‘కాశ్మీర్​ ఫైల్స్​’.. 
కాశ్మీర్  పండిట్లపై ఎటువంటి దాడులు జరిగాయో ‘కాశ్మీర్​ ఫైల్స్​’ సినిమాలో చూపించారని, కాశ్మీర్ లోని వాస్తవాలను బయటపెట్టారని సంజయ్  చెప్పారు. సినిమాలో చూపించినట్లు కాశ్మీర్​లో ఎన్నో ఏండ్ల నుంచి అరాచకాలు జరుగుతున్నయని, గతంలో ఇలాంటి సినిమాలు తీసినోళ్లు, నటించినోళ్లు బతుకుతరో లేదో తెలిసేది కాదని అన్నారు. ‘‘1990 లో కాశ్మీర్ పండిట్లు,  హిందువులు ఊచకోతకు గురయ్యారు. సర్జికల్ స్ట్రయిక్ జరిగిందో.. లేదో.. అన్న నేతలకు  ఈ సినిమా చూస్తే వాస్తవాలు తెలుస్తయి. ఆర్టికల్​ 370 రద్దుపై నిజాలు, గతంలో పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు ఏం చేశారో వంటి విషయాలను సినిమాలో చూపించిన్రు”అని సంజయ్ చెప్పారు.

ప్రతి భారతీయుడు ‘కాశ్మీర్​ ఫైల్స్’ చూడాలి: తరుణ్​ చుగ్​
ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు కాశ్మీర్​ ఫైల్స్ సినిమా చూడాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సూచించారు. ఈ సినిమా మాస్టర్ పీస్ అని, ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు వివేక్ అగ్నిహోత్రికి థ్యాంక్స్  చెప్తున్నట్లు ఆదివారం ట్విట్  చేశారు. కాశ్మీర్​ పండిట్లు ఎదుర్కొన్న సమస్యలను ఇందులో చూపించారని, దశాబ్దాలుగా మీడియా పబ్లిక్​కు చెప్పని విషయాలను ఈ సినిమా చూపించిందని ఆయన పేర్కొన్నారు.