
- భద్రతా కారణాలతో ఆపేశామన్న ఇండియా
- హైకమిషన్, కాన్సులేట్ సరిగా పని చేయలేకపోతున్నయ్
- కెనడా తన దౌత్యవేత్తల సంఖ్య తగ్గించుకోవాలని సూచన
న్యూఢిల్లీ : ఇండియా కెనడా మధ్య రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సెక్యూరిటీ త్రెట్స్ కారణంగా కెనడియన్లకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు మన విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ వీసాల జారీని కూడా టెంపరరీగా ఆపేసింది. అలాగే ఒట్టావా సోషల్ మీడియాలో భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు రావడంతో వారి రక్షణ చర్యల్లో భాగంగా తాత్కాలిక సర్దుబాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇండియా వాంటెడ్ టెర్రరిస్ట్, ఖలిస్తాన్ అనుకూల నేత నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపణలు చేయడంతో రెండు దేశాలమధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కెనడియన్లకు వీసాలను కేంద్రం నిలిపివేసింది. అయితే, ఈ సస్పెన్షన్ ఆర్డర్‌కు ముందు జారీ చేసిన వీసాలు మాత్రం చెల్లుబాటు అవుతాయని కేంద్రం తెలిపింది.
ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్న ట్రూడో
జీ20 సమిట్‌లో పాల్గొనేందుకు ఇండియా వచ్చిన సందర్భంగా కెనడా ప్రధాని ట్రూడో ప్రెసిడెన్షియల్ సూట్లో ఉండేందుకు తిరస్కరించినట్లు తెలిసింది. దానికి బదులుగా అతను సాధారణ గదిలో బస చేసినట్టు సమాచారం. జీ20 సమిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి గ్లోబల్ లీడర్‌కు భారత్ వీవీఐపీ ప్రెసిడెన్షియల్ సూట్లు బుక్ చేసింది. ఢిల్లీలోని లలిత్ హోటల్లో ట్రూడోకు బస ఏర్పాటు చేసింది.
అయితే ఆయన ప్రెసిడెన్షియల్ సూట్లో ఉండేందుకు తిరస్కరించారు. అదే హోటల్లోని మరో సాధారణ గదిలో ఉన్నారు. అలాగే తన అధికారిక విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో తిరుగు ప్రయాణం కూడా రెండు రోజులు ఆలస్యం అయింది. భారత్ ప్రత్యేక విమానానాన్ని సమకూర్చుతామని చెప్పినప్పటికీ ట్రూడో అంగీకరించలేదు.
భారత్ ఖండనపై మౌనం
నిజ్జర్ హత్యకు సంబంధించి ఇండియాపై ఆరోపణలు చేయడం గురించి మీడియా ప్రశ్నించగా ట్రూడో సమాధానం దాటవేశారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన న్యూయార్క్ రాగా.. భారత్ ఖండనపై స్పందన ఏంటని మీడియా ప్రశ్నించింది. అయితే, దీనిపై సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.