- మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని నిర్ధారణ
- మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కూ మరణశిక్ష
- పోలీస్ మాజీ చీఫ్ చౌధురీ అబ్దుల్లా మామూన్‌కు ఐదేండ్ల జైలు
- హసీనా అధికారం నిలబెట్టుకోవడానికి బలప్రయోగం చేశారన్న కోర్టు
- తీర్పు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందనుకుంటే క్షమించాలని విజ్ఞప్తి
- తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రత కట్టుదిట్టం
- ఢాకాలో హై అలర్ట్.. షూట్ ఎట్‌సైట్ ఆర్డర్స్
- ఇది అల్లా ఇచ్చిన ప్రాణం.. ఆయనే తీసుకుంటారు: హసీనా
- అవామీ లీగ్‌ను రాజకీయంగా నిర్మూలించేందుకే ఈ తీర్పని ఫైర్
- మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న కేసులో దోషిగా నిర్ధారణ
- తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలని విజ్ఞప్తి
- ఐసీటీ చుట్టూ భద్రత కట్టుదిట్టం.. ఢాకాలో షూట్ ఎట్‌సైట్ ఆర్డర్స్
- ఇది రాజకీయ ప్రేరేపితం: హసీనా
ఢాకా: బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యూనల్(ఐసీటీ) సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై నమోదైన కేసులపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ఐసీటీ.. హసీనాను దోషిగా తేల్చింది. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు సైతం కోర్టు మరణ శిక్ష విధించింది. పోలీస్ మాజీ చీఫ్ చౌధురీ అబ్దుల్లా అల్ మామున్‌కు ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
నిరుడు జులై-ఆగస్టు మధ్య జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని ఐసీటీ జడ్జి గోలాం మోర్తుజా మజుందర్ పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా నిరసనకు దిగినవారిని చంపేయాలని హసీనా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దేశవ్యాప్తంగా నిరసనకారులను చంపేందుకు ఈ ముగ్గురు ఒకరితో ఒకరు కుమ్మక్కై దురాగతాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
అయితే, ట్రిబ్యునల్, దేశ ప్రజల నుంచి క్షమాపణ కోరిన నేపథ్యంలో మాజీ పోలీస్ చీఫ్ మామున్‌కు కేవలం జైలుశిక్షతో సరిపెట్టింది. హసీనా, కమల్‌ను పరారీలో ఉన్న నిందితులుగా కోర్టు ప్రకటించింది. వారిద్దరినీ గైర్హాజరీలో విచారించారు. అప్రూవర్‌గా మారడానికి ముందు మామున్ వ్యక్తిగత విచారణ ఎదుర్కొన్నారు.
కోర్టు ఏమన్నదంటే ?
హసీనా ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోలేదని, విద్యార్థుల మాట వినడానికి బదులుగా అణచివేసేలా చర్యలు తీసుకున్నదని కోర్టు పేర్కొన్నది. నిరుడు ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని ప్రస్తావించింది.
విద్యార్థులను “రజాకార్లు” అనే అవమానకర పదంతో సూచిస్తూ నీచంగా మాట్లాడారని తెలిపింది. ఫలితంగా పెద్దఎత్తున హింస చెలరేగి, మారణహోమం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. గాయపడినవారికి వైద్యం అందించేందుకు నిరాకరించారన్నారు. అధికారంలో ఉండేందుకు హసీనా బలప్రయోగం చేశారన్నారు.
హసీనాకు, దక్షిణ ఢాకా మున్సిపల్ కార్పొరేషన్‌కు మధ్య జరిగిన సంభాషణలను జడ్జి మజుందర్ చదివి వినిపించారు. ప్రజలను రజాకార్లుగా, ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేసి హసీనా హింసను రెచ్చగొట్టారని, ఆమెపై అభియోగాల నిర్ధారణకు ఆధారాలున్నాయని చెప్పారు. మీడియా సమావేశంలో కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. ప్రేరేపణ, చంపమని ఆదేశించడం, దాడులను అరికట్టకపోవడం లాంటి నేరాల్లో హసీనాను కోర్టు దోషిగా తేల్చింది. తీర్పు ఇవ్వడంలో ఆలస్యం జరిగితే క్షమించాలని కోరింది.
ఢాకాలో హై అలర్ట్
హసీనాకు మరణశిక్ష విధించిన తర్వాత ట్రిబ్యూనల్ లోపల, వెలుపల ప్రజలు సంబురాలు చేసుకున్నారు. కొందరు షేక్ హసీనాను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ నినదించారు. తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఢాకాలో హైఅలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నించినా.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడినా వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షూట్ఎట్ సైట్ఆదేశాలు జారీ చేశారు.
ఆమెను వెంటనే అప్పగించాలని బంగ్లా డిమాండ్
మరణశిక్ష పడ్డ తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను తక్షణమే అప్పగించాలని భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్చేసింది. ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం భారత్ తప్పనిసరిగా ఈ పని చేయాలని చెప్పింది.చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డ వారికి ఆశ్రయం కల్పించడం లాంటి చర్యలు దౌత్యపరంగా సరైనది కాదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
అల్లా ఇచ్చిన ప్రాణమిది.. ఆయనే తీసుకుంటారు..
ప్రస్తుతం భారత్‌లో ఉన్న షేక్ హసీనా ఐసీటీ తీర్పుకు ముందు ఓ ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ‘‘నేను బతికే ఉన్నా, బతికి ఉంటా.. ప్రజల సంక్షేమం కోసం మళ్లీ పనిచేస్తా. బంగ్లా గడ్డమీద అందరికీ న్యాయం చేస్తా. ఇది అల్లా ఇచ్చిన ప్రాణం. ఆయనే తీసుకుంటారు. నా తల్లిదండ్రులను, తోబుట్టువుల ను కోల్పోయా. చివరకు నా ఇంటిని కూడా తగలబెట్టేశారు. ఇప్పుడు వీళ్లు ఏం తీర్పైనా ఇచ్చుకోనివ్వండి నేను లెక్కచేయను. ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటా” అని హసీనా స్పష్టం చేశారు.
ఐసీటీ తీర్పును రాజకీయ ప్రేరేపితమని ఆమె విమర్శించారు. తన పార్టీ అవామీ లీగ్‌ను నిర్మూలించేందుకే తాత్కాలిక ప్రభుత్వం దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందన్నారు. సాక్ష్యాలను న్యాయంగా పరిశీలించే సరైన కోర్టులో ఆరోపణలు చేసిన వారిని ఎదుర్కొనేందుకు తనకు భయం లేదన్నారు. ఈ ఆరోపణలను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆమె సవాల్ చేశారు.
