తెలంగాణలో బుల్లెట్ ట్రైన్ ప్రయాణికులు ఎవరు ? బుల్లెట్ ట్రైన్ టికెట్ ఖరీదు ఎంత ఉంటదో తెలుసా..?

తెలంగాణలో బుల్లెట్ ట్రైన్ ప్రయాణికులు ఎవరు ? బుల్లెట్ ట్రైన్ టికెట్ ఖరీదు ఎంత ఉంటదో తెలుసా..?

హైదరాబాద్ నగరానికి ముడిపెడుతూ 4 కొత్త రైలు మార్గాలను ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. మౌలిక వసతుల కల్పన పేరిట ఈ రకం ప్రాజెక్టులను ప్రజల మీద రుద్దుతున్నారు పాలకులు. ప్రజల ముందున్నవన్నీ వార్తలే. ఏ రకమైన అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

లక్షల కోట్ల పెట్టుబడికి సంబంధించి ఉత్తర్వులు, ప్రాజెక్టు డీపీఆర్ వగైరా అధికారిక సమాచారం లేకపోవడం శోచనీయం, సమాచారం స్వచ్ఛందంగా తామే పంచుకోవాలి అన్న రాజ్యాంగ బాధ్యతను విస్మరించి, అడిగినా సమాచారం ఇవ్వకపోవడంతోపాటు ప్రజలను నిర్వాసితులను చేసే భారీ పనులు చేపట్టడం భారత ప్రజాస్వామ్యంలో ఒక నూతన ఒరవడిగా మారింది. దీంట్లో ఏ ఒక్క అధికార పార్టీకి మినహాయింపు లేదు.

బెంగళూరు–హైదరాబాద్ మార్గం 626 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే  ప్రయాణించేందుకు బుల్లెట్ ట్రైన్ నిర్మాణం చేస్తామంటున్నారు. హైదరాబాద్–చెన్నై కారిడార్, అమరావతి మీదుగా చెన్నైకి వెళ్తూ  తెలంగాణలో 236 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది.  హైదరాబాద్– ముంబై/పూణే  మార్గానికి  సంబంధించిన  సమగ్ర  ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్‌‌‌‌‌‌‌‌) సిద్ధంగా ఉంది.  అలాగే,  శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 500 నుంచి 650 ఎకరాల విస్తీర్ణంలో ఒక హబ్  ఏర్పాటు కానుంది.

2026–27 కేంద్ర బడ్జెట్‌‌‌‌లో దాదాపు 4,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఏడు కొత్త హై-స్పీడ్  కారిడార్లను ప్రకటించారు.  వీటికి సుమారు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని  అంచనా.  శాస్త్రీయ నివేదిక లేకుండా,  ప్రాథమిక వ్యయ ప్రయాసల  బేరీజు లేకుండా, స్థానికుల అవసరాలతో నిమిత్తం లేకుండా, ‘ఖరీదు’ అయిన ప్రభుత్వ నిధులను ఈ ప్రాజెక్టుల మీద ఖర్చుపెట్టడానికి సిద్ధం అయ్యారు పాలకులు. ఎప్పుడూ వల్లె వేసేది ఒకటే...ప్రయాణ సమయం తగ్గుతుంది.

ప్రస్తుతం రైలులో 8 నుంచి 19 గంటల  సమయం,  లేదా  విమానంలో  సుమారు 1 గంట 15 నిమిషాలు పట్టే  బెంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణం,  బుల్లెట్ రైలులో 2 గంటల ప్రయాణంగా మారుతుంది. ముంబై నుంచి హైదరాబాద్  ప్రయాణ సమయం 12–15 గంటల నుంచి 3 గంటల  కంటే  తక్కువకు తగ్గుతుంది.  తగ్గుతున్న  ప్రయాణ సమయం  చూస్తే నిజంగా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, పెట్టె ఖర్చుకు తగిన ప్రయోజనాల విశ్లేషణ కావు.

బుల్లెట్ ట్రైన్ టికెట్ ఖరీదు ఎంత?
బుల్లెట్ ట్రైన్ మార్గం పూర్తి అయితే టికెట్ ధర సగటున ఏ మార్గం తీసుకున్నా కనీసం రూ.20 వేలు ఉంటుంది. భారత్‌‌‌‌లో బుల్లెట్ ట్రైన్ అత్యంత ఖరీదు అయిన ప్రయాణం. ఈ టికెట్ పెట్టి బుల్లెట్ ట్రైన్​లో ప్రయాణించడానికి నిత్య విమాన ప్రయాణికులలో సైతం కొద్దిమంది మాత్రమే సిద్ధపడతారు.  గుప్పెడు మందికి కోసం అపార నిధులను వెచ్చించి, అప్పులు చేసి, దానికి వడ్డీలు కట్టి, విలువైన ప్రకృతి సంపదను పణంగా పెట్టి బుల్లెట్ ట్రైన్ మార్గాలు కడుతున్నారు. ప్రభుత్వాలు అధికారికంగా టికెట్ గురించి, అందులో ఎవరు ప్రయాణిస్తారు వంటివి అసలే చర్చించరు.

ఇప్పటికే పదేండ్ల కిందట మొదలు పెట్టిన ముంబై-– అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కొనసాగుతున్న ఉదాహరణ.  వాస్తవ పరిస్థితులతో అంచనాలను సరిపోల్చి చూడాల్సిన ప్రాజెక్ట్ ఒకటి భారతదేశంలో ఇప్పటికే ఉంది - అదే ముంబై-– అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్. ఈ రెండు నగరాల మధ్య గంటకు 320–-350 కి.మీ. వేగంతో వెళ్లే బుల్లెట్ రైలు మూల ధన వ్యయం అంతకంతకు పెరుగుతున్నది.  ఇంకొక నాలుగేండ్లు పట్టవచ్చు ఇది పూర్తి కావడానికి. ఈ 508 కి.మీ. మార్గానికి సుమారు రూ.1.98 లక్షల కోట్ల వ్యయం, అంటే కిలోమీటరుకు దాదాపు రూ.390 కోట్లు.

బుల్లెట్ ట్రైన్ పట్టాల నిర్మాణం సూటిగా ఉండాలి
2015లో  రూ.1.08 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్ట్ 2023 నాటికి పూర్తి అవుతుంది అన్నారు. కానీ కాలేదు. ప్రస్తుతం దీని వ్యయం దాదాపు రూ.1.98 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంటే సుమారు 83 శాతం అదనపు భారం పడింది.

ఈ అనుభవం నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక,  తమిళనాడు, మహారాష్ట్రల గుండా సాగే  తదుపరి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌‌‌‌లను చేపట్టే ముందు కనీసం మొదటి ప్రాజెక్ట్ అంచనాలలో  ఎక్కడ లోపాలు జరిగాయో,  కొత్త  కారిడార్లలో వాటిని ఎలా సరిదిద్దుతున్నారో అధ్యయనాలు లేవు.  ఇప్పటివరకు అటువంటి వివరణ లేదా సమీక్ష ఏదీ తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేదు.  చాలామందికి, ప్రత్యేకంగా అధికారులకు పట్టని ఒక నిజం.. బుల్లెట్ ట్రైన్ పట్టాల నిర్మాణం సూటిగా, గీత గీసినట్టుగా ఉండాలి.

రైలు మార్గం ఎన్ని వంకరలు తిరుగుతుందో  దాన్నిబట్టి  దాని వేగం ఉంటుంది.  బుల్లెట్ ట్రైన్ అత్యంత వేగంగా, సురక్షితంగా  పోవడానికి  మార్గం నేరుగా ఉండాలి. గంటకు 320–350 కిలోమీటర్ల వేగంతో  వెళ్లే రైలు,  గంటకు 130 కిలోమీటర్ల  వేగంతో వెళ్లే  వందే భారత్  రైలులా సురక్షితంగా మలుపు తిరగలేదు.  హై-స్పీడ్  రైలు డిజైన్ ప్రమాణాల ప్రకారం గంటకు 300–350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి  కనీస వంపు వ్యాసార్థం సుమారుగా 5,500–7,000 మీటర్లు ఉండాలి.  అందుకే మార్గం ఎంచుకోవడం చాలా ముఖ్యం. బుల్లెట్ ట్రైన్ వల్ల నదులు, వాగులు, నీటి పరీవాహక వ్యవస్థ మొత్తం ఈ మార్గానికి దాసోహం కావాల్సిందే.

మౌలిక సదుపాయాల మధ్య పోటీ
తెలంగాణ సొంత ప్రాంతీయ రింగ్ రోడ్, దానితో పాటు వచ్చే ప్రాంతీయ రింగ్ రైల్వే 2025లో  తుది అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఆమోదం పొందిన  రూ.12,070 కోట్ల వ్యయంతో  కూడిన ఒక ప్రత్యేక 392- కిలోమీటర్ల ప్రాజెక్ట్.   ప్రస్తుతం బుల్లెట్ రైలు కోసం సర్వే  చేసే ప్రాంతం కూడా  దీనితో పోటీగా అనేక జిల్లాల గుండా వెళ్లుతున్నది.  వాటిలో  వికారాబాద్,  రంగారెడ్డి,  నాగర్ కర్నూల్,  మహబూబ్‌‌‌‌ నగర్,  నల్గొండ వంటివి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2025లో ప్రాంతీయ రింగ్ రోడ్ గురించి చేసిన ప్రకటనలో,  బుల్లెట్ రైలు కారిడార్‌‌‌‌ను కూడా రింగ్ రోడ్,  ప్రాంతీయ రింగ్ రైల్వేతో పాటు ఆధునిక అభివృద్ధి పరిధిలోకి స్పష్టంగా చేర్చింది.

ఈ మూడు ప్రాజెక్టులు..ఒక రింగ్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వే, ఒక రింగ్ రైల్వే,  ఒక బుల్లెట్ రైలు మార్గం.  ఒక్కొక్కదానికి  విడివిడిగా వేల ఎకరాల భూమి అవసరమవుతూ, నిర్మాణానికి వ్యవసాయ యోగ్య భూములను మార్చుకుంటూ, కొండలు, గుట్టలను తొలుచుకుంటూ, కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే  అవే  గ్రామీణ జిల్లాలపై  కేంద్రీకృతమవుతున్నాయి.

ఈ మూడు ప్రాజెక్టులు, ఉమ్మడిగా,  వ్యవసాయం, భూమి, గ్రామీణ జీవనోపాధులు, వృత్తులు, ఆవాసాలు, గ్రామాలు, పర్యావరణం, నీటి వనరులు (చెరువులు, కుంటలు, వాగులు, వగైరా) మీద చూపే దుష్ప్రభావాలను అంచనా వేయలేదు.

ఉనికిలో లేని గమ్య స్థానాలు
తెలంగాణలో  ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ శంషాబాద్  సమీపంలో ప్రతిపాదించిన 30,000 ఎకరాల 'గ్రీన్‌‌‌‌ఫీల్డ్' (పూర్తిగా కొత్తగా నిర్మించే) నగరం. దీని మాస్టర్ ప్లాన్ ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు. ఈ ఊహాజనిత నగరాలను కలుపుతూ ఇంకొక భారీ, ఊహాజనిత  బుల్లెట్ ట్రైన్ మార్గం నిర్మాణం ఏవిధంగా సబబు ? ఈ రెండు నగరాలలో నివాసాలు లేవు.

నివాసితులు ఎవరో తెలియదు. వారు ఏమి చేస్తారో తెలియదు. కానీ, వారికి ప్రయాణ వసతి మాత్రం  ముందే నిర్మాణం అవుతున్నది. దీన్ని దూరదృష్టి అంటామా?   క్లుప్తంగా చెప్పాలంటే, ఈ కారిడార్ల వినియోగం (రైడర్‌‌‌‌షిప్ – ప్రయాణికులు)పై చేసే అంచనాలలో గణనీయమైన భాగం, ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న రెండు నగరాల నుంచి ఆశించే ఆర్థిక కార్యకలాపాలపై ఆధారపడి ఉంది. 

దేశవ్యాప్తంగా కోట్లాదిమందికి అవసరమైన సాధారణ,  ఏసీయేతర బోగీలు కేవలం 57 వేలు మాత్రమే ఉన్నాయి. జనరల్ బోగీలు ఇందులో సగం కంటే తక్కువే ఉండవచ్చు. దేశమంతటా ఈ బోగీలలో ప్రయాణించేవారు కిక్కిరిసిపోయి అనేక ఇబ్బందుల మధ్య ప్రయాణం చేస్తున్నారు.

తెలంగాణలో అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేదు. లక్షలాది కుటుంబాలకు అందుబాటులోకి రాని  మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్ మీద ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం అన్యాయం.   తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తెలంగాణ వాసులకు ఉపయోగపడని, వారిని కష్టాలలోకి నెట్టే ప్రాజెక్టులు చేపట్టడం శోచనీయం.

డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.