వ్యవసాయాన్ని జీఎస్టీ నుంచి మినహాయిస్తం : రాహుల్

వ్యవసాయాన్ని జీఎస్టీ నుంచి మినహాయిస్తం : రాహుల్
  •   మేం వస్తే.. పంటల బీమా పథకంలో మార్పులు చేస్తం 

నాసిక్: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతుల గొంతుక అవుతామని కాంగ్రెస్  నేత రాహుల్  గాంధీ అన్నారు. వ్యవసాయాన్ని జీఎస్టీ నుంచి మినహాయిస్తామని, రైతులను కాపాడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందిస్తామని ఆయన చెప్పారు. పంటల బీమా పథకంలో మార్పులు చేస్తామన్నారు. రాహుల్  భారత్  జోడో న్యాయ్  యాత్ర గురువారం మహారాష్ట్రలోని నాసిక్  జిల్లా చంద్వాడ్ లో కొనసాగింది. ఎన్సీపీ లీడర్  శరద్  పవార్, శివసేన (ఉద్ధవ్  ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్  రౌత్  కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాహుల్  మాట్లాడుతూ.. తమ కూటమి అధికారంలోకి వస్తే రైతుల కోసం ఎప్పుడూ తలుపులు తెరిచి ఉంచుతామన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్  కమిటీ రిపోర్టు ప్రకారం కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇస్తామని చెప్పారు. ‘‘దేశంలో 70 శాతం మంది వద్ద ఉండాల్సిన సంపద కేవలం 20 నుంచి 25 శాతం ప్రజల వద్దే ఉంది. యూపీఏ సర్కారు రైతులకు రూ.70 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సర్కారు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. రుణమాఫీ చేసిన ఆ డబ్బుతో నరేగా కింద 24 ఏండ్లు పని కల్పించవచ్చు. పేదల ఉపాధికి ఏటా రూ.35 వేల కోట్లు ఖర్చుపెట్టవచ్చు. ధనవంతులకు రుణమాఫీ చేస్తే రైతులకు కూడా ప్రయోజనం చేకూర్చాలి” అని రాహుల్  గాంధీ వ్యాఖ్యానించారు. 

అగ్నిపథ్  పెద్ద మోసం

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్  స్కీమ్  పెద్ద మోసమని రాహుల్  విమర్శించారు. ఆ పథకంతో అగ్నివీరులకు పెన్షన్లు రావని, అమరవీర హోదా కూడా రాదని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఆరు నెలలు మాత్రమే అగ్నివీరులకు శిక్షణ ఇస్తారని, ఆ ఆరు నెలల్లో వారు ఏం నేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు.