సుప్రీంకోర్టులో నుపుర్‌ శర్మకు భారీ ఊరట

సుప్రీంకోర్టులో నుపుర్‌ శర్మకు భారీ ఊరట

ఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తనకు ప్రాణహాని ఉందన్న విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. నుపుర్ వినతి పిటిషన్‌ పై సానుకూలంగా స్పందించింది. నుపుర్ పై దాఖలైన అన్ని కేసులను కలిపి ఢిల్లీ పోలీస్‌ ప్రత్యేక సెల్‌ ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌ ( ఐఎఫ్‌ఎస్‌వో ) యూనిట్‌కు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాల పోలీస్‌ శాఖలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. దర్యాప్తు పూర్తయ్యే వరకు నుపుర్ ను అరెస్ట్‌ చేయకూడదని తెలిపింది. అరెస్ట్‌ విషయంలో ఇప్పటిదాకా రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. తనకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను కూడా నుపుర్‌ శర్మకు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 

మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్ చేసి నుపుర్ శర్మ వివాదంలో చిక్కుకుంది. నుపుర్ కామెంట్స్ తో ఆమెకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణ నిమిత్తం తాను కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్తే దాడులు జరగొచ్చని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని సుప్రీంకోర్టులో నుపుర్ శర్మ వినతి పిటిషన్‌ వేసింది. తనకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జస్టిస్‌ సూర్య కాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని బెంచ్‌ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కొత్తగా ఏదైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయినా కూడా ఢిల్లీకే బదిలీ చేయాలని సుప్రీం పేర్కొంది.

గతంలో ఇదే బెంచ్‌ నుపుర్ శర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి. ఆమెవి అహంకారపూరిత వ్యాఖ్యలు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.