- కంపెనీల వాల్యుయేషన్ల కంటే .. లాభాల బాట ముఖ్యం
- ‘క్యాపిటల్ అండ్ గ్రోత్ - ఇన్వెస్ట్‌మెంట్ పాత్‌వేస్’ పై ప్యానెల్ చర్చలో నిపుణులు
- విజన్ డాక్యుమెంట్ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగిస్తున్నదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యం నెరవేరాలంటే.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబిలిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ కీలకమని పారిశ్రామిక నిపుణులు పేర్కొన్నారు. కేవలం కంపెనీల వాల్యుయేషన్ల (విలువల) కోసం వెంపర్లాడటం మానేసి.. లాభదాయకమైన వ్యాపార నమూనాలపై దృష్టి పెట్టినప్పుడే ఆర్థిక ప్రగతి సాధ్యమని తెలిపారు.
మంగళవారం గ్లోబల్ సమిట్‌లో భాగంగా ‘క్యాపిటల్ అండ్ గ్రోత్ - ఇన్వెస్ట్‌మెంట్ పాత్‌వేస్’ అంశంపై జరిగిన చర్చాగోష్టిలో తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారి నిఖిల్ చక్రవర్తి, రీ-సస్టైనబిలిటీ ఎండీ గౌతమ్‌రెడ్డి, స్టెరిలైట్ టెక్నాలజీస్ ఎండీ అంకిత్ అగర్వాల్, ఏజీఐడీసీ సింగపూర్ సీఈవో మైక్ హాలండ్ పాల్గొన్నారు. వ్యాపార వృద్ధికి అవసరమైన మూలధనాన్ని వివిధ మార్గాల ద్వారా సంపాదించడం, పెట్టుబడి పెట్టడంపై మాట్లాడారు.
చెత్త నుంచి సంపద సృష్టించాలి: గౌతమ్‌రెడ్డి
దేశంలోని ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలాంటి మెట్రో నగరాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 90 శాతం శుద్ధి కావడం లేదని గౌతమ్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందన్నారు. ఈ రంగంలో గత 20 ఏండ్లలో రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెట్టినా ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పారు. వివాదాల పరిష్కారం (డిస్ప్యూట్ రెజల్యూషన్)పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రజల్లో పొదుపు అలవాటు పెరగాలి
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని చేరాలంటే ప్రజల్లో పొదుపు అలవాటు పెరగాలని నిఖిల్ చక్రవర్తి అన్నారు. వాల్యుయేషన్ల మోజులో పడకుండా వ్యాపారాలను బలోపేతం చేసుకోవాలని, నిరూపితమైన బిజినెస్ మోడల్స్ వైపు స్టార్టప్‌లు అడుగులు వేయాలని సూచించారు.
రోడ్లు, విద్యుత్ ఎంత ముఖ్యమో.. నేటి కాలంలో డిజిటల్ మౌలిక వసతులు అంతే ముఖ్యమని అంకిత్ అగర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీ -ఫైబర్ ప్రాజెక్టు ద్వారా మారుమూల గ్రామాలకూ ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయని, ఇది డిజిటల్ ఎకానమీకి వెన్నెముకగా నిలుస్తుందని తెలిపారు.
డేటా సెంటర్లు, ఏఐ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే కాకుండా.. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లాంటి బ్లూ కాలర్ జాబ్స్‌లోనూ నైపుణ్యాలు పెంచాల్సిన అవసరం ఉందని మైక్ హాలండ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 2047 విజన్ డాక్యుమెంట్, మాస్టర్ ప్లాన్ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నదని తెలిపారు.

