
ఖైరతాబాద్, వెలుగు : మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంపై న్యాయ విచారణ జరగాలని ప్రముఖ జియాలజిస్టు బీవీ సుబ్బారావు, ఆర్టీఐ మాజీ కమిషనర్ఆర్.దిలీప్‌రెడ్డి, పర్యావరణ వేత్త దొంతి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నాణ్యతల్లోనే లోపం ఉందన్నారు. ఇప్పడు పిల్లర్లకు పగుళ్లు మాత్రమే వచ్చాయి. వచ్చే మరో విపత్తు గురించి కూడా ఆలోచించాలన్నారు.
‘‘మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు: తెలంగాణ మీద భారం’’ అనే అంశంపై గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా మీట్లో వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విషయాలను రాష్ట్ర, కేంద్ర స్థాయిలో బహిర్గతం చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల ముందుంచాలి. ఈ ప్రాజెక్టులో వివిధ స్థాయిలలో ఉన్న నిర్ణేతలు, పర్యవేక్షకులకు పూర్తి బాధ్యత ఉంటుంది. ఆ విధంగానే దర్యాప్తు సంస్థలు, మీడియా, ప్రజలు భావించాలన్నారు. దీనిపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరగాలన్నారు.