కర్ణాటక వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గురువారం ( ఆగస్టు 20 ) నిర్వహించిన ఈ తనిఖీల్లో రైల్వే స్టేషన్ కిచెన్ల డొల్లతనం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... పలు రైల్వే స్టేషన్లలోని కిచెన్లలో అనుమతి లేని ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన మిల్క్ ప్రాడక్ట్స్, ఆహారాన్ని సరిగ్గా నిల్వచేయకపోవడం,కిచెన్ అపరిశుభ్రంగా ఉండటం గుర్తించామని తెలిపారు అధికారులు.
రైల్వే స్టేషన్లలోని హోటళ్లు, రైల్వే ప్యాంట్రీల్లో ఆహార నాణ్యత, శుభ్రత, లేబులింగ్, తదితర అంశాలు మురుగుపరిచే దిశగా ఈ తనిఖీలు నిర్వహించారు అధికారులు.ఈ సందర్భంగా, బెంగళూరు, యశ్వంత్‌పుర, కెఆర్ పురం, యలహంక, కోలార్, మైసూరు, హావేరి, ఉడిపి, హుబ్బల్లి, మంగళూరు సహా 36 రైల్వే స్టేషన్‌లలోని 112 ఆహార కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు.
మంగళూరు-కేరళ, హుబ్బళ్లి-బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో సహా, రైళ్లలో అందించే ఆహారాన్ని కూడా ఈ తనిఖీలో పరిశీలించారు అధికారులు. ఈ రైళ్లను పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారని అధికారులు గుర్తించారు. అయితే, రైల్వే హోటళ్లలో అనేక ఉల్లంఘనలు గుర్తించామని తెలిపారు అధికారులు.
జిలేబీలలో పసుపు రంగు, ఖోవా పేడాలో గులాబీ రంగు ఉపయోగించినట్లుగా గుర్తించారు అధికారులు.హవేరి జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్‌లో, గడువు ముగిసిన నందిని పెరుగు, డోడ్లా స్టాండర్డైజ్డ్ పాల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కేఆర్ పురం రైల్వే స్టేషన్‌లోని ఒక హోటల్లో, మైసూరు రైల్వే స్టేషన్‌లో ప్లాస్టిక్ సామాగ్రిని ఉపయోగించి ఇడ్లీలు తయారు చేస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. తనిఖీ సందర్భంగా కిచెన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు కూడా గుర్తించామని తెలిపారు.
అంతే కాకుండా కొన్ని చోట్ల ఉల్లిపాయలు, ఇతర కూరగాయలపై బూజు గుర్తించామని... ప్లాస్టిక్ బకెట్లలో చట్నీని నిల్వ ఉంచడాన్ని గుర్తించామని తెలిపారు.
