హైదరాబాద్: మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో పనిచేస్తున్న 26 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి.. ఆమె చనిపోవడానికి కారణమైన ఘటనలో ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు లింగమనేని సంజుష్పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లింగమనేని రమేష్ జనసేన పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ కావడం గమనార్హం.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భారతీ ముఖి అనే యువతి ఇన్‌ఆర్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పనిచేస్తుంది. ఆగస్టు 16న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మాల్‌కు ఎదురుగా రోడ్డు దాటుతుండగా ఆస్టన్ మార్టిన్ కారు అతివేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దురదృష్టవశాత్తూ ఆమె చనిపోయింది.
హైదరాబాద్ మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్లో లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పని చేస్తున్న భారతి ముఖి (26) భోజనం తెచ్చుకోవడానికి తన తోటి ఉద్యోగిని పూజాతో కలిసి బయటకు వెళ్లింది. ఫుడ్ తీసుకుని ITC హోటల్ వైపు నుంచి ఇనార్బిట్ మాల్ వైపు రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చి కారు భారతిని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో భారతికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆమె స్పాట్లోనే చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవ్ చేసింది జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజుష్ అని గుర్తించారు. లింగమనేని కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
