జీవో నెం.77పై టాలీవుడ్‌లో దుమారం.. పునఃసమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఫిల్మ్ ఛాంబర్ లేఖ!

జీవో నెం.77పై టాలీవుడ్‌లో దుమారం.. పునఃసమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఫిల్మ్ ఛాంబర్ లేఖ!

తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ గా జారీ చేసిన జీవో నెం.77 సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. థియేటర్ల వసతుల ఆధారంగా కొత్త కేటగిరీలు విభజించడం, భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల సవరణపై జారీ చేసిన ఈ జీవోపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తెచ్చిన 'స్పెషల్ థియేటర్' నిబంధనలు సింగిల్ స్క్రీన్లను కోలుకోలేని దెబ్బతీస్తాయని ఆందోళన చెందుతున్నారు.

ప్రశ్నార్థకంగా థియేటర్ల మనుగడ.. 

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చిన్న పట్టణాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఉన్న టౌన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) హెచ్చరించింది. వెంటనే ఈ జీవోను పునఃసమీక్షించాలని కోరుతూ ఫిల్మ్ ఛాంబర్ గౌరవ కార్యదర్శి వి.ఎల్. శ్రీధర్ నేతృత్వంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కీలక లేఖతో పాటు అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

అవసరమైతే కోర్టుకు.. 

ఏకపక్ష నిర్ణయాల వల్ల టాలీవుడ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మండిపడింది. రెంట్లు, కరెంట్ బిల్లులు, మెయింటెనెన్స్ భారంతో ఇప్పటికే సతమతమవుతున్న సింగిల్ స్క్రీన్ల యజమానులకు ఈ సవరణలు కోలుకోలేని షాక్ ఇచ్చాయనేది వారి వాదన. ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రితో నేరుగా భేటీ అయి లేఖ అందించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించడానికి 10 రోజుల గడువు ఇస్తున్నామని, సానుకూల నిర్ణయం రాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోమని సంచలన హెచ్చరిక చేశారు.

రీ-థింక్ చేయండి..

మరోవైపు పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ప్రతినిధులతో తక్షణమే ఒక 'కన్సల్టేటివ్ కమిటీ' ని ఏర్పాటు చేయాలని  ఫిల్మ్ ఛాంబర్ కోరింది. ప్రభుత్వం, సినీ పెద్దలు కూర్చుని చర్చిస్తేనే అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది అభిప్రాయపడింది. సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి విజ్ఞప్తి చేసింది. కొత్త విధానంతో టౌన్ థియేటర్లపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఈ టికెట్ల సినిమా ఏ మలుపు తిరుగుతుందో, ప్రభుత్వం రీ-థింక్ చేస్తుందో లేదో వేచి చూడాలి..