ట్రంప్ నిర్ణయంతో కుప్పకూలిన టెక్స్‌టైల్, రొయ్యల స్టాక్స్.. ఇన్వెస్టర్లలో వణుకు

ట్రంప్ నిర్ణయంతో కుప్పకూలిన టెక్స్‌టైల్, రొయ్యల స్టాక్స్.. ఇన్వెస్టర్లలో వణుకు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యాపై విధిస్తున్న కఠిన ఆంక్షల ప్రభావం ఇప్పుడు భారతీయ స్టాక్ మార్కెట్‌పై, ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడ్డ కంపెనీలపై స్పష్టంగా కనిపిస్తోంది. రష్యాతో ఆయిల్ బిజినెస్ కొనసాగిస్తున్న దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 500 శాతం వరకు సుంకాలు విధించే ప్రతిపాదనకు ట్రంప్ ఆమోదం తెలపడంతో.. జనవరి 8న ట్రేడింగ్‌లో భారతీయ టెక్స్‌టైల్, రొయ్యల ఎగుమతి కంపెనీల షేర్లు కుప్పకూలాయి.

తాజా పరిణామంతో అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడే కంపెనీలు భారీగా నష్టపోయాయి. దీంతో టెక్స్‌టైల్ రంగానికి చెందిన ప్రముఖ దుస్తుల ఎగుమతి సంస్థ గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు దాదాపు 13 శాతం కుప్పకూలి రూ.596.65 వద్దకు చేరాయి. అలాగే పెర్ల్ గ్లోబల్షేర్లు 6 శాతం, కె.పి.ఆర్ మిల్ షేర్లు 2 శాతానికి పైగా నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. 

ఇక ట్రంప్ చర్యలతో వణికి పోతున్న మరో రంగం సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్. దీంతో భారత్ నుంచి రొయ్యల ఎగుమతిలో అగ్రగామిగా ఉన్న అవంతి ఫీడ్స్ షేర్లు 7 శాతం, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ షేర్లు 6 శాతం మేర పతనమయ్యాయి. తమ ఆదాయంలో అగ్రభాగం అమెరికా మార్కెట్ నుంచే వస్తుండటంతో ఈ కంపెనీల పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.

అసలు ఏమిటీ ఆంక్షల బిల్లు? 
అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రతిపాదించిన 'శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025' అనే ఈ బిల్లు రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా రూపొందించబడింది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ లేదా యురేనియం కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలను శిక్షించేందుకు వాషింగ్టన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు ప్రకారం.. రష్యా నుంచి వచ్చే వస్తువులపై కనీసం 500 శాతం డ్యూటీ విధించడమే కాకుండా, రష్యాతో వ్యాపారం చేసే దేశాల ఉత్పత్తులపై కూడా భారీ జరిమానాలు విధిస్తారు.

వచ్చే వారమే ఈ బిల్లుపై అమెరికా కాంగ్రెస్‌లో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇది గనుక చట్టరూపం దాల్చితే, భారతీయ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్ దాదాపు మూసుకుపోయినట్లే అవుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దౌత్యపరంగా రష్యాను ఒంటరి చేయాలని అమెరికా భావిస్తుండగా.. అది భారతీయ పారిశ్రామిక రంగాలపై పెను ప్రభావం చూపుతోంది.