సచిన్‌, గవాస్కర్‌ కాదు.. కోహ్లీనే నా ఫేవరెట్‌ క్రికెటర్: కేంద్ర విదేశాంగ మంత్రి

సచిన్‌, గవాస్కర్‌ కాదు.. కోహ్లీనే నా ఫేవరెట్‌ క్రికెటర్: కేంద్ర విదేశాంగ మంత్రి

సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి.. ఈ ముగ్గురు క్రికెటర్లు మూడు తరాల క్రికెట్ కు ప్రసిద్ధి.. వీరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం కష్టం. ఎవరి తరంలో వారి ఆట గొప్పది. నిలకడగా ఆడటంలో గవాస్కర్ వీరుడైతే.. వేగంగా ఆడటంలో, ఒత్తిడిలో రాణించడంలో సచిన్, కోహ్లీ ప్రసిద్ధులు. ఈ ముగ్గురిలో అత్యుత్తమ భారత బ్యాటర్ ఎవరనే ప్రశ్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌‌కు ఎదురవ్వగా.. ఆయన విరాట్ కోహ్లీ అని బదులిచ్చారు.

ఇటీవల జైశంకర్.. సుశాంత్ సిన్హా యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో  పాల్గొన్నారు. ఆ సమయంలో హోస్ట్.. గవాస్కర్, సచిన్, కోహ్లి.. ఈ ముగ్గురిలో అత్యుత్తమ భారత బ్యాటర్ ఎవరని అడిగారు. ఆ ప్రశ్నకు మూడు తరాల క్రికెట్ చూసే అదృష్టాన్ని పొందిన జైశంకర్, మిగిలిన ఇద్దరు దిగ్గజాల కంటే కోహ్లీని ఎంపిక చేశారు. అందుకు గల కారణాన్ని ఆయన వివరించారు. అతని ఫిట్‌నెస్, వైఖరి కారణంగా కోహ్లీని మిగతా ఇద్దరి కంటే ఎంచుకున్నట్లు వెల్లడించారు.

భీకర ఫామ్‌లో విరాట్

ఇదిలా వుంటే, ప్రస్తుతం విరాట్ భీకర ఫామ్‌లో ఉన్నాడు.  ఐపీఎల్ పదిహేడో సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 154.70 స్ట్రైక్ రేట్, 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. తద్వారా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. భారత రన్ మెషిన్‌గా పేరొందిన విరాట్.. ఈ వయసులోనూ భీకర ఫామ్‌లో ఉండటానికి అతని ఫిట్‌నెస్సే కారణమన్నది విశ్లేషకుల మాట. ఆట పట్ల అతనికున్న అంకితభావం, కసి అతన్ని లేటు వయసులోనూ టాప్‌ క్రికెటర్‌గా నిలబెడుతున్నాయని చెప్తుంటారు.