- ఇండియాపై ఆర్థిక నేరగాళ్ల సెటైర్ వీడియోపై కేంద్రం స్పందన
- మేం పారిపోయొచ్చినోళ్లమంటూ వీడియో చేసిన లలిత్, మాల్యా
న్యూఢిల్లీ: బ్యాంకులను రూ. వేల కోట్లు మోసగించి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, లలిత్ మోదీలను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. దేశంలో చట్టాల నుంచి తప్పించుకుని, పరారీలో ఉన్న వ్యక్తులందరినీ మళ్లీ తిరిగి తీసుకువచ్చి, శిక్షించడానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇండియాను ఎగతాళి చేస్తూ ఇటీవల లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోపై శుక్రవారం రణధీర్ జైస్వాల్ స్పందించారు. " బ్యాంకులను రూ. వేల కోట్లు మోసగించి విదేశాలకు పారిపోయినవారిని తిరిగి భారత్ రప్పించేందుకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం.
ఈ విషయంలో మేం అనేక దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. నిందితులను తిరిగి రప్పించేందుకు ప్రాసెస్ కొనసాగుతున్నది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనైనా కోర్టుల ముందు నిలబెడతాం" అని పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే..
ఈ నెల18న లండన్‌లో విజయ్ మాల్యా తన 70 వ బర్త్ డే సందర్భంగా పార్టీ ఇచ్చాడు. దీనికి హాజరైన లలిత్ మోదీ.. విజయ్ మాల్యాతో కలిసి ఓ వీడియో రికార్డు చేశాడు. అందులో ఇండియాను ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. ‘మేమిద్దరం భారత్ నుంచి పారిపోయి వచ్చిన అతిపెద్ద నేరస్తులం" అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.
దానికి మాల్యా వెటకారంగా నవ్వాడు. ఆ వీడియోను లలిత్ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ పోస్టుకు ‘మళ్లీ భారత్‌లో ఇంటర్నెట్‌ను షేక్ చేద్దాం’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. మన చట్టాల వైఫల్యం వల్లే వారికి ఇలాంటి వీడియో చేసే ధైర్యం వచ్చిందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో లలిత్ మోదీ, మాల్యాను రప్పిస్తామని కేంద్రం చెప్పింది.
హెచ్1బీ ఇష్యూపై యూఎస్‌తో మాట్లాడినం
హెచ్1బీ వీసాల జారీలో ఆలస్యం, ఇంటర్వ్యూల వాయిదాకు సంబంధించిన సమస్యలను అమెరికా దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై రెండు దేశాల మధ్య చర్చ జరుగుతున్నదని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
‘‘హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా వాయిదా వేయడంతో చాలామంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి మాకు చాలా వరకు వినతులు వచ్చాయి. ఈ ఇష్యూను అమెరికా దృష్టికి తీసుకెళ్లాం” అని తెలిపారు.
