యుద్ధం వేళ వర్క్ ఫ్రమ్ హోం.. ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ సూచన..

యుద్ధం వేళ వర్క్ ఫ్రమ్ హోం.. ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ  సూచన..

EY Work From Home: ఏ నిమిషం పరిస్థితులు ఎలా మారిపోతాయో అనే ఆందోళనలో అటు పాకిస్థాన్, ఇటు ఇండియాలోని ప్రజలు, ప్రభుత్వాలు, కంపెనీలు ఆందోళనలో ఉన్నాయి. పాకిస్థాన్ తన కవ్వింపులతో యుద్ధానికి కాలుదువ్వుతున్న వేళ ముందస్తు భద్రత చర్యల్లోకి అనేక కంపెనీలు వెళుతున్నాయి. ఈ క్రమంలో తమ ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు వీలు కల్పిస్తున్నాయి.

తాజాగా దిగ్గజ సంస్థ ఈవై తన భారతీయ ఉద్యోగులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లోని ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం ముదురుతున్న ఇండియా పాక్ యుద్ధ పరిస్థితుల్లో ఇంటి వద్ద నుంచే పనిచేయాలని కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాధిన అనేక నగరాల్లో హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 

Also Read:-యుద్ధ సమయంలో కుప్పకూలిన గోల్డ్ రేట్లు.. తగ్గిన హైదరాబాద్ రేట్లివే..

కంపెనీ తన ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రకారం.. ప్రస్తుతం దిగజారుతున్న భద్రత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల రక్షణను పరిగణలోకి తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. దిల్లీ, ఛండీగడ్, జైపూర్, అహ్మదాబాద్ ఆఫీసుల్లోని ఉద్యోగులు నేడు ఇంటి నుంచే పనిచేయాలని అందులో పేర్కొంది. ఇదే క్రమంలో ఇతర నగరాల్లోని ఉద్యోగులు సైతం ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై సమయానుకూలంగా స్పందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

ప్రస్తుతం దేశంలోని హర్యాణా, పంజాబ్, రాజస్థాన్, దిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోని కీలక నగరాలపై పాక్ దాడులకు ప్రయత్నిస్తున్న వేళ ఇతర కంపెనీలు సైతం దీనికి అనుగుణంగా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల డ్రోన్ దాడులు, మిసైల్ దాడులకు పాక్ ప్రయత్నిస్తు్న్నప్పటికీ వాటి భారత రక్షణ శాఖ నిర్వీర్యం చేస్తున్నట్లు ప్రకటించింది.