- వీటితో మేలు కంటే హాని ఎక్కువని గుర్తించిన నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: దేశీయంగా లభించే 16 రకాల ఫిక్స్‌డ్ -డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాల (రెండు లేదా అంతకంటే ఎక్కువ మందుల మిశ్రమం) పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ కాంబినేషన్ల వాడకానికి ఎటువంటి వైద్యపరమైన సైంటిఫిక్ ఆధారాలు లేవని, వీటితో ప్రయోజనం కంటే రిస్క్ ఎక్కువని నిపుణుల కమిటీ తేల్చడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 లోని సెక్షన్ 26ఏ కింద ఈ నిషేధాన్ని విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
నిషేధించిన ముఖ్యమైన మందులు
యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు: అమోక్సిసిలిన్ + సెరాటియోపెప్టిడేస్ మిశ్రమం, అమోక్సిసిలిన్ + క్లోక్సాసిలిన్; పారాసిటమాల్ + లిగ్నోకైన్; డైసైక్లోమైన్ + పారాసిటమాల్ + క్లిడినియం బ్రోమైడ్ వంటి కాంబినేషన్లు.
స్కిన్ కేర్ ప్రొడక్ట్స్: అలోవెరా/అలో ఎక్స్‌ట్రాక్ట్‌తో పాటు విటమిన్ ఇ, జోజోబా ఆయిల్, వీట్ జెర్మ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ వంటివి కలిపి తయారుచేసే పలు డెర్మటోలాజికల్ లోషన్లు, క్రీములు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ పరిశోధనల తర్వాతే ఈ చర్యలు తీసుకున్నారు. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడానికి,
మార్కెట్లో సైంటిఫిక్ ఆధారాలున్న మందులు మాత్రమే లభించేలా చూడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని కేంద్రం తెలిపింది. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ విభాగాలను, తయారీదారులను ఆదేశించింది.
