- ఇండియాకు క్యూ కడుతున్న టాప్ ఎంఎన్‌సీలు..జీసీసీల ఏర్పాటకు మొగ్గు..
- లాభపడుతున్న రియల్ ఎస్టేట్ సెక్టార్ ఆకర్షిస్తున్న హైదరాబాద్
న్యూఢిల్లీ: ఇండియా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీలకు) హబ్‌గా మారుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంస్కరణలు, స్కిల్స్ ఉన్న యువత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగవుతుండడమే ఇందుకు కారణం. గతంలో జీసీసీలు అంటే కేవలం మల్టీనేషనల్ కంపెనీలు (ఎంఎన్‌సీలు) ఖర్చులను తగ్గించుకోవడానికి ఏర్పాటు చేసే బ్యాక్- ఆఫీస్ సపోర్ట్ కేంద్రాలుగా మాత్రమే చూసేవారు. కానీ ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
కన్సల్టెన్సీ కంపెనీ ‘జేఎల్‌ఎల్ ఇండియా’ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం భారత్‌లో 2 వేల కంటే ఎక్కువ జీసీసీలు ఉండగా, వీటిలో 19 లక్షల మందికి పైగా ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలు కేవలం సపోర్ట్ రోల్స్‌కే పరిమితం కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డెవలప్‌మెంట్, కోర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) వంటి టెక్నాలజీ ఇన్నోవేషన్స్‌కు వేదికలుగా మారాయి.
ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో సరికొత్త రికార్డు
జీసీసీలు వస్తుండడంతో రియల్ ఎస్టేట్ సెక్టార్ లాభపడుతోంది. 2025లోనే భారతదేశంలోని టాప్ 7 నగరాల్లో జరిగిన మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో ఏకంగా 38 శాతం వాటాను జీసీసీలే దక్కించుకున్నాయి. రికార్డు స్థాయిలో 3.13 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని ఇవి లీజుకు తీసుకున్నాయి. ఎంఎన్‌సీలు తమ ప్రధాన వ్యాపార సాఫ్ట్‌వేర్, ఆటోమేషన్, డిజిటల్ సేవలను భారత్ నుంచే నడిపిస్తున్నాయి. యూఎస్ హూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ డీసీ మంజునాథ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) వంటి పథకాలు డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలలో విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తున్నాయన్నారు.
ఐసీఐసీఐ బ్యాంక్, కేబీఆర్ ప్రతినిధులు అతుల్ జైన్, యోగేష్ షెవాడే, నటాషా ఫ్రాస్టోలు మాట్లాడుతూ.. భారతదేశంలో టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ రంగాలలో ప్రతి సంవత్సరం 100కు పైగా కొత్త జీసీసీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. దేశంలో అందుబాటులో ఉన్న అపారమైన ఇంజనీరింగ్ టాలెంట్ పూల్, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టాయని
తెలిపారు.
హైదరాబాద్ లో 400 జీసీసీలు
పెద్ద మొత్తంలో జీసీసీలను హైదరాబాద్ ఆకర్షిస్తోంది. తాజా రిపోర్ట్‌ల ప్రకారం, ఈ సిటీలో 350 నుంచి 400 కంటే ఎక్కువ సెంటర్లు పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏర్పాటవుతున్న కొత్త జీసీసీలలో దాదాపు 40 శాతానికి పైగా వాటాను దక్కించుకుంటూ హైదరాబాద్ దూసుకుపోతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, జేపీ మోర్గన్ చేజ్, నోవార్టిస్, వెల్స్ ఫార్గో, మైక్రాన్ టెక్నాలజీ వంటి గ్లోబల్ దిగ్గజాలు ఇక్కడ భారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం జీసీసీలను ఆకర్షించడానికి సరికొత్త "తెలంగాణ జీసీసీ పాలసీ" ని అమలు చేస్తోంది. అర్హత గల ప్రాజెక్టుల పెట్టుబడులపై సుమారు 30శాతం వరకు క్యాపిటల్ సబ్సిడీని అందిస్తోంది. సింగిల్ విండో సిస్టమ్ అయిన టీఎస్ ఐపాస్ ద్వారా కేవలం 15 రోజుల్లోనే అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో మంజూరు చేస్తోంది.
