- సీఎం ఆదేశాలు బేఖాతర్.. అటెండెన్స్‌పై పట్టింపు సున్నా
- బాచుపల్లి క్యాంపస్‌కు వచ్చేదెప్పుడో.. పోయేదెప్పుడో
- వీసీ కూడా వారానికి ఒకటీ రెండ్రోజులే.. వర్సిటీ పాలన గాలికి
- పట్టించుకోని ఉన్నత విద్యాశాఖ అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో పారదర్శకత పెంచేందుకు, సిబ్బందిలో టైమింగ్స్ పాటించేలా, జవాబుదారీతనం తెచ్చేందుకు ప్రభుత్వం ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని కచ్చితం చేసింది. స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీల వరకు ఈ రూల్ అమలు కావాలని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కానీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో మాత్రం ఈ ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. పాత బయోమెట్రిక్ విధానానికి ఎప్పుడో మంగళం పాడిన అధికారులు.. కొత్తగా ఫేషియల్ అటెండెన్స్ ప్రవేశపెట్టడానికి మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో ఆఫీసర్లు, సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
మూడు నెలల ముచ్చటగా బయోమెట్రిక్
తెలుగు వర్సిటీ పరిధిలోని నాలుగు పీఠాల పరిధిలో రీసెర్చ్, పీజీ, డిగ్రీ, డిప్లోమా, సర్టిఫికేట్, డిస్టెన్స్ సహా పలు ప్రోగ్రామ్స్ కొనసాగుతున్నాయి. వీటిలో సుమారు వెయ్యి మంది విద్యార్థులు చదువుతుండగా, బోధన, బోధనేతర సిబ్బంది 260 మంది పనిచేస్తున్నారు. రెండేళ్ల కింద వర్సిటీ నాంపల్లి నుంచి బాచుపల్లికి షిఫ్ట్ అయినప్పుడు కొత్తగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించారు.
కానీ అది కేవలం మూడు, నాలుగు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. ఆ తర్వాత ఆ సిస్టమ్‌ను అటకెక్కించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సర్కారు స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు, డిగ్రీ, పాలిటెక్నిక్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్ విధానం అమలవుతున్నది. అన్ని యూనివర్సిటీల్లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ తెలుగు వర్సిటీ అధికారులు మాత్రం అవేవీ తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా డ్యూటీలు చేస్తున్నారనే విమర్శలు
క్యాంపస్ సిటీకి దూరంగా బాచుపల్లిలో ఉండటంతో.. టైమింగ్స్ పాటించకుండా ఇష్టారాజ్యంగా డ్యూటీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వర్సిటీలోని ఉద్యోగుల గ్రూపుల రాజకీయాల వల్లే ఈ అటెండెన్స్ విధానాన్ని అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. కొందరు సిబ్బంది ఉదయం11 గంటలకు వచ్చి.. సాయంత్రం 3, 4 గంటలకు వచ్చిపోతున్నారనీ, మరికొందరు రోజుకు రెండు, మూడు గంటలు ఉండి వెళ్లిపోతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. రెగ్యులర్‌గా టైమ్ పాటించే ఉద్యోగులు వేళ్లమీద లెక్కపెట్టేంత మందే ఉండటం గమనార్హం.
రెగ్యులర్ రానీ వీసీ.. అప్‌డేట్ కానీ వర్సిటీ
యూనివర్సిటీకి దిశానిర్దేశం చేయాల్సిన వైస్ చాన్సలర్ కూడా రెగ్యులర్‌గా రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే క్యాంపస్‌కు వస్తున్నారని, అది కూడా కాసేపు ఉండి వెళ్లిపోతున్నారని సిబ్బంది చెప్తున్నారు. అటు రిజిస్ట్రార్ కూడా వర్సిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని వాదనలున్నాయి.
ఈ డిజిటల్ కాలంలోనూ వర్సిటీలో సర్టిఫికేట్లు పొందాలంటే ఆన్‌లైన్ పేమెంట్ కాకుండా డీడీలు తీయాల్సి రావడం వర్సిటీ వెనుకబాటుతనానికి అద్దం పడుతున్నది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బందిని అడిగే నాథుడే లేకుండా పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి తెలుగు వర్సిటీలో ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయాలని, పాలనను గాడిలో పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

