IND vs PAK: ఇజ్రాయిల్‌కు మద్ధతు తెలిపిన సిరాజ్.. అసలు నిజం ఇదే..!

IND vs PAK: ఇజ్రాయిల్‌కు మద్ధతు తెలిపిన సిరాజ్.. అసలు నిజం ఇదే..!

భారత క్రికెటర్, మన హైదరాబాదీ ముద్దుబిడ్డ మహమ్మద్ సిరాజ్ ఇజ్రాయిల్‌లోకి చొరబడి మారణహోమం సృష్టించిన హమాస్ ఉగ్రవాదుల చర్యలను పరోక్షంగా ఖండిస్తూ ట్వీట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది. వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ పేసర్.. ఆ ప్రదర్శనను ఇజ్రాయిల్‌లోని సోదరసోదరీమణులకు అంకితం ఇచ్చినట్లు సిరాజ్ (@iamMohdSiiraj) పేరుతో ఓ యూజర్ ట్వీట్ చేశాడు.

రిజ్వాన్ vs సిరాజ్ 

నాలుగురోజుల క్రితం పాకిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ పాలస్తీనాకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన రిజ్వాన్.. పాకిస్తాన్ జట్టు విజయాన్ని గాజా(పాలస్తీనా) పౌరులకు అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. "పాకిస్తాన్ జట్టు విజయంలో నేనూ భాగమైనందకు సంతోషిస్తున్నా.. ఈ విజయాన్ని గాజాలోని మా సోదరులు, సోదరీమణులకు అంకితం.." అని రిజ్వాన్ ట్వీట్ చేశాడు. 

ఇది జరిగిన నాలుగు రోజులకే సిరాజ్ ఇజ్రాయిల్‌కు మద్ధతు ఇచ్చినట్లు తెలుపుతూ పోస్ట్ పెట్టడం కలకలం రేపుతోంది. సిరాజ్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ @mdsirajofficial కాగా, దాదాపు దానికి దగ్గరగా ఉన్న @iamMohdSiiraj ఐడీ నుంచి ట్వీట్ రావడం  అభిమానులను గందరగోళంలోకి నెట్టింది. వాస్తవానికి సిరాజ్.. ఎలాంటి ట్వీట్ చేయలేదు. తన దృష్టంతా దేశానికి వరల్డ్ కప్ సాధించిపెట్టడం మీదనే ఉంది. ఆ దిశగా అద్భుత ప్రదర్శన కనపరుస్తున్నాడు.

బిత్తరపోయిన బాబర్ ఆజామ్

ఇక ఈ మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్‌కు ఏ మాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై లైన్ అండ్ లెంగ్త్‌తో పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. క్రాస్ సీమ్ డెలివరీతో ఆ జట్టు ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(20)‌ను ఔట్ చేసిన సిరాజ్.. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ బాబర్ ఆజామ్(50)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమికి దగ్గరగా ఉంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(80; 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు).. నలువైపులా బౌండరీలు బాదుతూ పరుగుల వరద పారిస్తున్నాడు.