V6 News

8 గంటల పని.. రూ.20 వేల జీతం కావాలి.. నోయిడాలో హింసాత్మకంగా ఫ్యాక్టరీ వర్కర్ల ఆందోళన

8 గంటల పని..  రూ.20 వేల జీతం కావాలి.. నోయిడాలో హింసాత్మకంగా ఫ్యాక్టరీ వర్కర్ల ఆందోళన
  • పలు వాహనాలకు నిప్పుపెట్టిన కార్మికులు
  • నెలకు రూ.15 వేలతో బతకడమెలాగని ప్రశ్న

న్యూఢిల్లీ: నోయిడాలో ఫ్యాక్టరీ కార్మికులు సోమవారం నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రోజుకు 8 గంటల పని కల్పించాలని, నెలకు రూ.20 వేల జీతం ఇవ్వాలని డిమాండ్  చేస్తూ ఫేజ్ 2 ఏరియాలో కార్మికులు ఆందోళన చేశారు. అయితే, నిరసన క్రమంగా హింసకు దారితీసింది. పలువురు కార్మికులు ఆగ్రహానికి గురై వాహనాలకు నిప్పు పెట్టారు. కార్లతో పాటు ఓ పోలీసు వ్యాన్  కూడా కాలిపోయింది. అలాగే, ఇండస్ట్రియల్  ఏరియాలోని బిల్డింగులపై రాళ్లు విసిరారు.

 ఈ సందర్భంగా వర్కర్లు మీడియాతో మాట్లాడారు. ఫ్యాక్టరీ ఓనర్లు తమకు నెలకు రూ.15 వేల జీతం ఇస్తున్నారని, ఈ జీతంతో ఎలా బతకగలమని ప్రశ్నించారు. కొంతమంది కార్మికులకు రూ.13 వేల కన్నా తక్కువ ఇస్తున్నారని వాపోయారు. ‘‘నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. వంటగ్యాస్, ఇంటి అద్దె, పిల్లల స్కూల్  ఫీజులు ఇలా అన్నీ పెరిగాయి. కానీ, మా జీతాలు మాత్రం పెరగడం లేదు. 

చాలీచాలని జీతాలతో మా బతుకులు దుర్భరంగా మారాయి. ఈ వేతనాలతో పిల్లలకు ఎలా చదువు చెప్పించగలం? వారిని ఎలా పెంచగలం? కనీసం పిల్లల స్కూల్  ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం. ఫ్యాక్టరీ యాజమాన్యాలు రోజూ మాతో  నిబంధనలకు విరుద్ధంగా 12 గంటలు పనిచేయించుకుంటున్నాయి. ఓవర్ టైమ్  డ్యూటీ చేసినా దానికి తగ్గట్లు పేమెంట్  ఇవ్వడం లేదు” అని కార్మికులు పేర్కొన్నారు. హర్యానాలో కార్మికులకు ప్రభుత్వం జీతాలు పెంచిందని, అక్కడ పెంచగా నోయిడాలో తమకూ ఎందుకు పెంచరని ప్రశ్నించారు.

  • హర్యానాలో కార్మికుల జీతాలు పెంపు

హర్యానాలో ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు 35% పెంచింది. నైపుణ్యంలేని వర్కర్లు, సెమీస్కిల్డ్  కార్మికులు, స్కిల్డ్  వర్కర్స్, హైలీస్కిల్డ్  వర్కర్స్  అనే తేడా లేకుండా అందరికీ జీతాలు పెంచింది. దీంతో ఎలాంటి నైపుణ్యంలేని కార్మికులు నెలకు రూ.15,220, సెమీస్కిల్డ్  వర్కర్స్  రూ.16,780 సంపాదిస్తున్నారు. కాగా, నోయిడా కార్మికుల ఆందోళనపై యూపీ సీఎం యోగి స్పందించారు. కార్మిక చట్టాలు అమలుచేయాలని, ప్రతి కార్మికుడికీ గౌరవప్రదమైన జీతాలు ఇవ్వాలని ఇండస్ట్రియల్ యూనిట్లను ఆయన ఆదేశించారు.