తప్పులు రిపీట్‌‌ చేయడం వల్లే.. ఈ పరిస్థితి

తప్పులు రిపీట్‌‌ చేయడం వల్లే.. ఈ పరిస్థితి

వరల్డ్‌‌కప్‌‌లో జట్టు ఆటతీరుపై సౌతాఫ్రికా కెప్టెన్‌‌ డుప్లెసిస్‌‌

లండన్‌‌: ప్రస్తుత పరిస్థితుల్లో తమదో సాధారణ జట్టు అని, చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేయడం వల్లే ఈ స్థితికి వచ్చామని సౌతాఫ్రికా కెప్టెన్‌‌ డుప్లెసిస్‌‌ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌‌తో మ్యాచ్‌‌లో తమ ఆటతీరు మరీ తీసికట్టుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘సరైన లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌తో బౌలింగ్‌‌ చేస్తే సరిపోయే వికెట్‌‌ మీద చాలా చెత్త బంతులు వేశాం. అక్కడి నుంచే పరిస్థితి మా చేజారిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌‌లో మంచి ఆరంభం లభించి, భాగస్వామ్యాలు నమోదు చేస్తున్న దశలో టపాటపా వికెట్లు కోల్పోయాం. ఒకేరకమైన తప్పులు పదేపదే  చేసి సాధారణ జట్టుగా మిగిలాం. నా కెరీర్‌‌లో అత్యంత గడ్డుకాలంలో ఉన్నా.  మేము సరిగ్గా ఆడలేదు కాబట్టే విమర్శలు ఎదుర్కొంటున్నాం. ఈ ఫలితంతో కెప్టెన్సీ వదిలేయాలనే ఆలోచన నాకు లేదు.’ అని డుప్లెసిస్‌‌ చెప్పుకొచ్చాడు.

రబాడకు ఐపీఎల్‌‌ వద్దని చెప్పాం..

వరల్డ్‌‌కప్‌‌ నేపథ్యంలో ఐపీఎల్‌‌లో ఆడొద్దని పేసర్‌‌ కగిసో రబాడకు సౌతాఫ్రికా జట్టు మేనేజ్‌‌మెంట్‌‌ముందే చెప్పిందని డుప్లెసిస్‌‌ తెలిపాడు. ‘వరల్డ్‌‌కప్‌‌కి  ఫ్రెష్‌‌గా ఉండాలనే ఉద్దేశంతో రబాడ ఐపీఎల్‌‌కు వెళ్లకుండా చూడాలని ప్రయత్నించాం. అయితే అతను వెళ్లాడు. మధ్యలోనే వెనక్కి వస్తాడని అనుకున్నాం, కానీ చివరిదాకా ఉన్నాడు. గతంతో పొలిస్తే మెగా టోర్నీలో రబాడ పేస్‌‌ పదును కాస్త తగ్గింది. అంత మాత్రాన ఐపీఎల్‌‌ను నిందించాల్సిన పనిలేదు’ అని డుప్లెసిస్‌‌ తెలిపాడు.