ఫేక్‌ ఎన్‌ఓసీల దందా.. అధికారుల అండ!..పైసలిస్తే చాలు.. ప్రైవేటు కాలేజీల్లో ఉత్తుత్తి తనిఖీలు

ఫేక్‌ ఎన్‌ఓసీల దందా..  అధికారుల అండ!..పైసలిస్తే చాలు.. ప్రైవేటు కాలేజీల్లో ఉత్తుత్తి తనిఖీలు
  •     డీఐఈఓల కనుసన్నల్లోనే ఫైర్ సర్టిఫికెట్ల మాయాజాలం
  •     రంగంలోకి దిగిన ఇంటర్ బోర్డు, హైడ్రా.. 52 కాలేజీలపై కేసులు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ప్రాణాలతో మేనేజ్మెంట్లు, అధికారులు చెలగాటమాడుతున్నారు. అకాడమిక్ ఇయర్ మొదలైందంటే చాలు.. తనిఖీల పేరుతో కొందరు డీఐఈఓలు కాసుల వేట మొదలుపెడుతున్నారు. నిబంధనల ప్రకారం వసతులు లేకున్నా, ఫైర్ సేఫ్టీని గాలికి వదిలేసినా.. పైసలు ముడితే చాలు.. ఆల్ ఈజ్ వెల్ అంటూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నామమాత్రపు తనిఖీలు చేసి.. తప్పుడు రిపోర్టులు తయారు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

తాజాగా వెలుగులోకి వచ్చిన ‘ఫేక్ ఫైర్ ఎన్​ఓసీల’ బాగోతం ఈ విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ ఏడాది 1400 ప్రైవేటు కాలేజీలు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో డీఐఈఓలు ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. అన్నీ బాగున్నాయని సర్టిఫై చేస్తూ ఇంటర్ బోర్డుకు ఫొటోలు, సర్టిఫికెట్లు పంపారు. కానీ, బోర్డు సెక్రటరీ అభిలాష అభినయ్ నేతృత్వంలో సిబ్బంది వీటిని క్షుణ్ణంగా పరిశీలించగా అసలు రంగు బయటపడింది. ఖాళీ గదులను ల్యాబులుగా, లైబ్రరీలుగా చూపించడమే కాకుండా.. కనీసం బాత్‌రూమ్‌లు లేని కాలేజీలకు కూడా అధికారులు క్లీన్ చిట్ ఇచ్చేసినట్లు తేలింది. దీంతో ఆగ్రహించిన సెక్రటరీ.. దరఖాస్తులను మళ్లీ వెరిఫై చేయాలని వెనక్కి పంపారు. మే నాటికి పూర్తి కావాల్సిన అఫిలియేషన్లు ఆగస్టు వచ్చినా ఇంకా కొలిక్కి రాలేదు.

52 ప్రైవేటు కాలేజీలపై కేసులు..

నిబంధనల ప్రకారం అగ్నిమాపక శాఖ, హైడ్రా ఇవ్వాల్సిన ఎన్​ఓసీలను కొన్ని కాలేజీలు జీహెచ్ఎంసీ ద్వారా పొందినట్లు గుర్తించారు. మరికొన్ని ఫేక్ ఎన్​ఓసీలను తీసుకొచ్చి అనుమతులు పొందాయి. ఇప్పటివరకు 52 ప్రైవేటు కాలేజీలపై కేసులు నమోదు కాగా, ఇంటర్ బోర్డు ఒక్కో కాలేజీకి రూ. 8 లక్షల చొప్పున భారీ జరిమానా విధించింది. అయితే, ఫేక్ ఎన్​ఓసీల అంశంలో ఓ ఫైర్ సర్వీసెస్ తో పాటు ఇంటర్ బోర్డులో ఫైరవీలు చేసే ఓ వ్యక్తి కీలకంగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ నుంచి రూ. 6 లక్షల నుంచి 8 లక్షల దాకా తీసుకొని ఈ సర్టిఫికెట్లు ఇప్పించినట్టు మేనేజ్మెంట్లు.. ఇంటర్ బోర్డు సెక్రటరీకి ఫిర్యాదు చేశాయి. వీరికి కొందరు డీఐఈఓలు అండగా ఉన్నారనే విమర్శలున్నాయి.

ఆఫీసర్ల అండ..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ డీఐఈఓ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో కాలేజీ నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల దాకా వసూలు చేస్తూ వసూల్ రాజాగా అవతారమెత్తినట్లు చర్చ జరుగుతోంది. సదరు అధికారికి ‘తిండి యావ’ కూడా ఎక్కువేనట. ఆఫీసులోని కింది స్థాయి ఉద్యోగిని కలెక్షన్ ఏజెంట్‌గా పెట్టుకొని వసూళ్లు చేయడం.. మేనేజ్మెంట్ల నుంచి రోజూ పెద్ద హోటళ్ల నుంచి కొర్రమీను కూర, నిలోఫర్ నుంచి ఛాయ్, స్నాక్స్ తెప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

సదరు అధికారిపై ఇప్పటికే ఏసీబీ కేసు ఉన్నా.. ఏమాత్రం భయం లేకుండా దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. మరో జిల్లా అధికారి కూడా పేరెంట్స్, విద్యార్థి సంఘాల ఫిర్యాదుల పేరుతో మేనేజ్మెంట్లను బెదిరించి లక్షలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.