కశ్మీర్ లో తప్పించుకుని.. హైదరాబాద్ లో దొరికిన ఫేక్ IFS

కశ్మీర్ లో తప్పించుకుని.. హైదరాబాద్ లో దొరికిన ఫేక్ IFS

హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసం చేసే కిలాడీ మాయగాడిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.  తన ఫ్రెండ్స్ IAS, IPS ఉద్యోగాలు సాధించి జీవితంలో సక్సెస్ అయ్యారని.. తాను కూడా ఏదో విధంగా ప్రభుత్వ అధికారిగా చెలామణి అవ్వాలనే లక్ష్యంతో అడ్డ దారులు తొక్కాడు ఓ వ్యక్తి. ఫేక్ IFS కార్డ్ ను సృష్టించి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అమయాకులను ఆసరాగా తీసుకుని మోసం చేస్తున్నాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. నిందితుడి నుండి 40 వేల రూపాయలు, కొరియా దేశ డాలర్లు, ఒక సెల్ ఫోన్, నకిలీ గుర్తింపు కార్డ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు చెందిన కుర్శిద్ అహ్మద్ దార్ అనే వ్యక్తి హైద్రాబాద్ లో తిరుగుతూ.. ఫేక్ IFS (ఇండియన్ ఫారెన్ సర్వీస్) అధికారిని అని చెప్పుకుంటూ.. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాని వారిని లక్ష్యంగా చేసుకున్నాడు.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారి దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. ఇతని మాయలో పడ్డ కొందరు డబ్బులు ఇచ్చి మోసపోయామని తెలుసుకున్నారు. నిరుద్యోగులకు తన నెంబర్ ఇచ్చి ఫోన్ లో టచ్ లో ఉండమని మొదట డబ్బు చెల్లించాలని చెప్పేవాడు. గతంలో కాశ్మీర్ లో కూడా ఇలాంటి మోసాలు చేసాడని , అలాగే ఇక్కడ కూడా చేయవచ్చనే ఉద్దేశ్యంతో వచ్చాడని పోలీసులు తెలిపారు. పి.జి రోడ్ లో సిద్దార్థ్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో..  అతడు 40 వేల రూపాయలు ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు కుర్శిద్ అహ్మద్ దార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంత సులువుగా రావని నోటిఫికేషన్లు ఉంటాయని ప్రజలు ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైఫాబాద్ ఏ. సి.పి వేణుగోపాల్ రెడ్డి సూచించారు.