​నకిలీ టికెట్లు అమ్ముతున్న ముఠా అరెస్టు

​నకిలీ టికెట్లు అమ్ముతున్న ముఠా  అరెస్టు

ఉప్పల్, వెలుగు: ఐపీఎల్​క్రికెట్ మ్యాచ్​నకిలీ టికెట్లు అమ్ముతున్న ఆరుగురు ముఠా సభ్యులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 68 ఫేక్ టికెట్లు, అక్రిడిటేషన్​ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గురువారం ఉప్పల్ ​పోలీస్ స్టేషన్​లో మల్కాజిగిరి ఏసీపీ నరేశ్​రెడ్డి వివరాలు వెల్లడించారు. నాచారంలో ఉండే కోమటిరెడ్డి గోవిందరెడ్డి(22) పలు రకాల ఈవెంట్లకు పనులు చేస్తుంటాడు. ఇదే క్రమంలో ఈనెల 18న ఉప్పల్​ స్టేడియంలో సన్​రైజర్స్​ హైదరాబాద్, ​-ముంబై ఇండియన్స్​జట్ల మధ్య జరిగిన క్రికెట్​ మ్యాచ్​కు టికెట్ల వాలిడేషన్ పనులు కావాలని గోవిందరెడ్డిని ఐపీఎల్ ​నిర్వాహకులు కోరారు.

అయితే, ఆ టికెట్ల బార్​కోడ్ లు కాపీ చేసి నకిలీ టికెట్లు తయారు చేయాలని అతడు ప్లాన్ ​వేశాడు. ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్​ హిమాయత్​నగర్​కు చెందిన అఖిల్​ అహ్మద్​ ఎలియాస్​పప్పు(23), మహ్మద్​అజాజ్(23), మృదుల్​వంశీ ఎలియాస్​చిన్ను(22), బహదూర్​పురాకు చెందిన మహ్మద్​ ఫహీమ్(21), చెంగిచెర్లకు చెందిన శ్రావణ్​కుమార్(22)కు చెప్పడంతో వారు ఇందుకు ఒప్పుకున్నారు. అఖిల్​ అహ్మద్ టికెట్ల బార్​ కోడ్​ను కాపీ చేసి మృదుల్​వంశీ కి పంపాడు. ః

వాటిని వంశీ మహ్మద్​ ఫహీమ్ కు పంపగా అతడు వాటితో చిక్కడపల్లిలోని తన జిరాక్స్​ సెంటర్​లో నకిలీ టికెట్లు తయారు చేశాడు. వాటిని మహ్మద్ అజాజ్ తార్నాకలోని తన జిరాక్స్​సెంటర్​లో ప్రింట్​చేశారు. ఇలా సుమారు 200 నకిలీ టికెట్లు తయారు చేసి 130 వరకు విక్రయించారు. వాటిని కొన్న కొందరు క్రికెట్​అభిమానులు స్టేడియానికి వెళ్లగా నకిలీవని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 68 నకిలీ టికెట్ల, ఆరు సెల్​ఫోన్​లు, ఐపీఎల్ నిర్వాహకులు జారీ చేసిన అక్రిడిటేషన్ ​కార్డులు, సీపీయూ, మానిటర్​ స్వాధీనం చేసుకున్నారు.