ఏటూరునాగారం, వెలుగు : స్వేచ్ఛ పేరుతో పత్రికలు, మీడియా సంస్థలు ప్రజల స్వేచ్ఛను హరించేలా నిరాధారమైన వార్తలు రాయొద్దని మంత్రి సీతక్క సూచించారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఓ బాలిక వ్యవహారానికి సంబంధించి కొందరు ప్రతిపక్ష నాయకులు, వ్యక్తులు, కొన్ని పత్రికా, మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
వాస్తవాలను వివరించేందుకు పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల దర్యాప్తులో తేలిన విషయాలను ప్రజల ముందు ఉంచేందుకు ఏటూరునాగారంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివరాలు వెల్లడించేందుకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తే, కొందరు మీడియా ప్రతినిధులు దానిని బహిష్కరించి నిరసన చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకురాలి కుమారుడిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు.. తాము రోడ్డెక్కి నిరసన చేయాలన్నారు. కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నాయని మండిపడ్డారు. రేటింగ్స్, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు వార్తలు రాసి బాలిక జీవితంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. అసలు ఎలాంటి తప్పు జరగలేదని, తమను అకారణంగా బజారుకు ఈడుస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఆరోపణలు చేస్తున్న వారి వద్ద సరైన ఆధారాలు ఉంటే, పోలీసులకు సమర్పించాలని సవాల్ చేశారు. తప్పు జరిగినట్లు తేలితే ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదన్నారు. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా, పత్రికా సంస్థలకు లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరించారు. మంత్రి వెంట రేగ కల్యాణి, ఇర్సవడ్ల వెంకన్న, చిటమట రఘు, గుడ్ల దేవేందర్, వావిలాల చిన్నఎల్లయ్య, చెన్నూరి బాలరాజు, గద్దల నవీన్, పోలేబోయిన గోపాల్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా... తప్పుడు కథనాలు రాసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో వారి ఇండ్లను ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని నిరసిస్తూ కొందరు రిపోర్టర్లు మంత్రి సీతక్క ప్రెస్‌మీట్‌ను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
