
చిట్యాల : ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేస్తున్న ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చిట్యాల మండలంలోని చల్లగరిగకు చెందిన బండి రాజు, కూచన రాజేందర్, భామర్ రాంసింగ్ , గోపాలపురంకు చెందిన మూల శంకరయ్యలు ముఠాగా ఏర్పడి మూడేళ్లనుంచి కొంతమంది రైతుల పేర నకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేస్తున్నారని, ములుగు ఆర్డీఓ, చిట్యాల తహసీల్దా ర్ సంతకాలను ఫోర్టరీ చేసి అక్రమ సంపాదనకు పాల్పడ్డారని భూపాపల్లి డిఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు.
రెవెన్యూ అధికారుల సమాచారంతో చల్లగరిగలోని బండి రాజు ఇంట్లో చిట్యాల ఎస్సై అనీల్ కుమార్ తనిఖీ చేయగా 13 నకిలీ పాస్‌పుస్తకాలు , రె వెన్యూ ఆఫీసుల రబ్బర్‌స్టాంపులు దొరికాయని, వీటి ఆధారంగా దర్యాప్తు చేయగా నకిలీ పాసుపుస్తకాలు తయారు చేయడంతోపాటు కమిషన్లు తీసుకుని బ్యాంకుల్లో లోన్లు ఇప్పించినట్టు వారు ఒప్పుకున్నారని తెలిపారు. వరంగల్ లోని లత ప్రింటింగ్ ప్రెస్ యజమాని దేవేందర్‌రెడ్డి దగ్గర పాసుపుస్తకాలు ముద్రించినట్టు తెలిసిందన్నారు. అతన్ని కూడా అరెస్టు చేస్తామన్నారు. గతంలో ఉన్న పాస్‌పుస్తకాలు మాత్రమే తయారు చేసి, బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారన్నారు. బ్యాంకు లోన్ల వివరాలుతీసుకుని, అక్రమంగా లోన్లు తీసుకున్న వా రిమీద కూడా కేసులు పెడతామన్నారు.