ఫాల్తాలో గెలిచేది మేమే..బీజేపీకి టీఎంసీ బహిరంగ సవాల్‌‌

ఫాల్తాలో గెలిచేది మేమే..బీజేపీకి టీఎంసీ బహిరంగ సవాల్‌‌
  • మోదీ, అమిత్ షా వచ్చినా ప్రజల తీర్పు మారదని ధీమా

కోల్‌‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఏప్రిల్ 29న జరిగిన రెండో విడత పోలింగ్‌‌లో తీవ్రమైన ఎన్నికల అక్రమాలు, ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించారనే కారణంతో ఈసీ అక్కడ పోలింగ్‌‌ను రద్దు చేసి, మే 21న మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీజేపీని విమర్శిస్తూ అధికార టీఎంసీ ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘బీజేపీ తన పూర్తి యంత్రాంగాన్ని ఉపయోగించినా ఫాల్తాలో ఓటమి తప్పదు. 

నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్.. మీకు దమ్ముంటే ఫాల్తాకు రండి. 50 వేల మంది కేంద్ర బలగాలను మోహరించండి. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సాయుధ వాహనాలను ఉంచండి. మీ వద్ద ఉన్న ‘సింగం’ ఆఫీసర్లందరిని రప్పించండి. ఏం చేసినా ఫాల్తా ఓటర్ల తీర్పు మారదు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పశ్చిమ బెంగాల్‌‌ ఎన్నికలకు యూపీ క్యాడర్‌‌‌‌కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను పోలీస్ అబ్జర్వర్‌‌‌‌గా ఈసీ నియమించింది. నేరగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తారని ‘సింగం’ గా ఆయనకు పేరుంది. 

విధుల్లో భాగంగా పోలింగ్‌‌కు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికలప్పుడు ఆయన హెచ్చరించారు. దీంతో అజయ్ పాల్ శర్మపై కూడా టీఎంసీ మండిపడింది. బీజేపీ ఐటీ సెల్, అనుకూల మీడియా చేసే తప్పుడు ప్రచారాలు ఫాల్తాలో పనిచేయవని టీఎంసీ ఎద్దేవా చేసింది. ‘‘రెండు వారాల పాటు నిరంతరాయంగా అబద్ధాలు ప్రచారం చేయండి. పెయిడ్ మీడియాతో ఊదరగొట్టండి. చివరికి ఓట్లు లెక్కించినప్పుడు ఫాల్తా ప్రజల తీర్పు మారదు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి’’ అని సవాల్​ విసిరింది.