
సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు : సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన తమ వారి డెడ్‌బాడీల కోసం కుటుంబ సభ్యులు మార్చురీ వద్ద పడిగాపులు పడుతున్నారు. పటాన్‌చెరు ఏరియా హాస్పిటల్ మార్చురీలో 20 డెడ్‌బాడీలను భద్రపరచగా, డీఎన్ఏ రిపోర్టులు రాగానే బంధువులకు అప్పగించాలన్న ఆలోచనలో ఆఫీసర్లు ఉన్నారు. కానీ మార్చురీ వద్దే ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో అంబులెన్స్ తిరిగితే చాలు.. తమ వారినే తీసుకొచ్చారేమోనని వాటి వెనకాల పరుగులు పెడుతున్నారు. బాధిత కుటుంబాల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మారుమోగుతోంది. మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించే విషయమై అడిషనల్ కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో సమన్వయం చేస్తున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు.
జస్టిన్ వస్తాడని తల్లి...
రాజేంద్రనగర్ బండ్లగూడకు చెందిన జస్టిన్ ఆచూకీ నాలుగు రోజులుగా లభించకపోవడంతో కొడుకు వస్తాడని తల్లి ఎదురుచూస్తోంది. కనిపించిన వారినల్ల అడుగుతూ నా కొడుకును చూశారా ? కన్నీరు మున్నీరవుతోంది. తల్లి, భార్య, పిల్లలు, బంధువులు అతని జాడ కోసం వెదుకుతున్నారు. పేలుడు ఘటనలో నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన జస్టిన్ చనిపోయి ఉంటాడని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు అతని డెడ్‌బాడీని గుర్తించలేదు. డీఎన్‌ఏ పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించినప్పటికీ ఇంకా గుర్తించాల్సి ఉంది.
4 రోజులుగా మార్చురీ వద్దే..
బిహార్‌కు చెందిన నాగ అనే కార్మికుడి ఆచూకీ దొరకకపోవడంతో అతని భార్య డబ్ల్యూ నాలుగు రోజులుగా మార్చురీ వద్ద ఉంటోంది. ఘటన జరిగిన రోజు నుంచి భర్త ఆచూకీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఆమె ఎంతకీ లభించకపోవడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తోంది. చనిపోతే కనీసం డెడ్‌బాడీ అయినా ఇవ్వండి అని కనిపించిన వాళ్లతో మొర పెట్టుకుంటోంది. చివరకు గురువారం బిహార్‌కు చెందిన స్పెషల్ ఆఫీసర్లు ఇక్కడకు రావడంతో వారితో మొరపెట్టుకోగా, శుక్రవారం ఉదయం నాటికి నాగ డెడబాడీని అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కన్నీరు పెట్టుకుంటూ చంటి బిడ్డతో అక్కడే పడిగాపులు కాస్తోంది.
భర్త కోసం భార్య ఆరాటం
తన భర్త ఎక్కడ ఉన్నాడని ఓ భార్య నాలుగు రోజులుగా ఆరాటపడుతోంది. బిహార్ కు చెందిన లాల్‌పాల్ నాలుగేళ్లుగా సిగాచి రసాయన పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల కింద జరిగిన దుర్ఘటనలో లాల్‌పాల్ ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ ఘటనలో అతను చనిపోయి ఉంటాడని అధికారులు ఆమెకు చెప్పడంతో కన్నీరు మున్నీరవుతోంది. భర్త డెడ్‌బాడీని గుర్తించేందుకు రక్త నమూనాలు తీసుకొని మూడు రోజులు అవుతున్నా ఇప్పటివరకు డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి చేయలేదని ఆవేదన చెందుతోంది. ఒకే రోజులో డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి చేయవచ్చని.. తాను కూడా నర్సుగా పనిచేస్తున్నానని.. తనకు అన్నీ తెలుసన్నారు. భర్త డెడ్‌బాడీ అప్పగించకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు