- నిబంధనలను తుంగలో తొక్కిన ఆఫీసర్లు
- రాష్ట్రంలో డబుల్ పంక్చర్ల్యాప్రోస్కోపిక్ సర్జన్ల కొరత
- ఉన్నదే నలుగురు.. వారిలో ఒకరు రిటైర్డ్ డాక్టర్
హైదరాబాద్, వెలుగు: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించే విషయంలో ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. డబుల్ పంక్ఛర్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్లను నియమించుకోకుండా కేవలం నలుగురితోనే వేల సర్జరీలు చేయిస్తున్నారు. ఇందులోనూ ఒకరు రిటైర్డ్ డాక్టర్ కావడం గమనార్హం. నిరుడు రాష్ట్రంలో 502 క్యాంపులు పెట్టి, ఈ నలుగురు డాక్టర్లతోనే 24,233 డీపీఎల్ సర్జరీలు చేయించారు. అంటే, సగటున ఒక్కో డాక్టర్ 125 క్యాంపులు నిర్వహించి, 6058 సర్జరీలు చేసినట్టు లెక్క. ఒక్కో డాక్టర్ ఒక్కో క్యాంపులో 48 చొప్పున సర్జరీలు చేసినట్టు ఈ వివరాలు స్పష్టం చేస్తున్నయి. ఈసారి మరీ దారుణంగా ఒక్కో క్యాంపులో 60 సర్జరీలు చేశారు. రూల్స్ ప్రకారం ఒక క్యాంపులో 30కి మించి సర్జరీలు చేయకూడదు. క్యాంపులో ఒక్కరే డాక్టర్ ఉంటే 10కి మించి డీపీఎల్ సర్జరీలు చేయకూడదు. కానీ, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి, ఒకే రోజులో పెద్ద సంఖ్యలో ఆపరేషన్లు చేయిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం ఘటనలో..
ఇబ్రహీంపట్నం హాస్పిటల్‌లోనూ ఒక్క డాక్టరే కొన్ని గంటల వ్యవధిలో34 మందికి సర్జరీ చేశారు. దీన్ని బట్టి ఎంత వేగంగా ఆయన సర్జరీలు చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఆరోజు మూడు ల్యాప్రోస్కోపిక్ కిట్లు వినియోగించినట్టుగా సిబ్బంది చెబుతున్నారు. ఒకరి తర్వాత ఒకరికి సర్జరీ చేసే క్రమంలో, కనీసం ఆ ఎక్విప్‌మెంట్‌ను సరిగా స్టెరిలైజ్ చేశారా లేదా అన్నది కూడా సందేహంగా మారింది. దీనివల్ల ఒకరి జబ్బులు మరొకరికి అంటుకునే ప్రమాదం కూడా ఉంది. ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా అందరికీ సోకుతుంది. ఈ నిర్లక్ష్యపు చర్యలు వల్ల నలుగురు బాలింతలు ప్రాణాలు కోల్పాగా, ఇంకో 25 మంద ఇన్ఫెక్షన్లతో దవాఖాన్ల పాలయ్యారు.
