ఏదేమైనా CM అయితడు: విజయ్ ఇంటి ముందు ఫ్యాన్ కన్నీళ్లు

ఏదేమైనా CM అయితడు: విజయ్ ఇంటి ముందు ఫ్యాన్ కన్నీళ్లు

చెన్నై: అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మెజార్టీ లేకపోవడంతో టీవీకేని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించడం లేదు. దీంతో విజయ్ సీఎం అవుతాడా.. లేదా..? అన్న ఆందోళన టీవీకే కార్యకర్తల్లో గంటగంటకు పెరిగిపోతుంది. 

ఈ క్రమంలోనే ఓ టీవీకే కార్యకర్త తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గురువారం (మే 7) చెన్నైలోని విజయ్ ఇంటి ముందు ప్రార్థనలు చేస్తూ.. టీవీకే చీఫ్‎కు ఎదురవుతోన్న ప్రస్తుత పరిస్థితిని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏదేమైనా విజయ్ తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు ఎదురైన తమ నాయకుడు ధీటుగా ఎదుర్కొంటాడన్నారు. 

విజయ్‎కు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ లేదు.. సీఎం అవ్వడం కష్టమేనని వార్తా ఛానెళ్లు ఏవేవో చెప్పిన తమ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఇంత దూరం రావడానికి విజయ్ ఎంతో కష్టపడ్డారని.. గెలిచాక కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్రానికి కాబోయే సీఎం ఇంటి దగ్గర ఒక్క పోలీస్ అధికారి కూడా లేరని.. ఇది నాకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీ (108 సీట్లు)గా అవతరించిన టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గురువారం (మే 7) రెండోసారి గవర్నర్ రాజేంద్ర  విశ్వనాథ్ అర్లేకర్‎ను విజయ్ కలిశారు. అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిగా తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించాలని.. ఆ తర్వాత సభలో మెజార్టీ నిరూపించుకుంటామని కోరారు.

కానీ విజయ్ అభ్యర్థనను రెండోసారి కూడా గవర్నర్ తిరస్కరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని కుండబద్దలు కొట్టారు గవర్నర్. దీంతో విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మరోసారి బ్రేక్ పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు వరుస ఆటంకాలు ఏర్పడుతుండటంతో టీవీకే కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.