- ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల నమ్మకాన్ని గెలిచాం: శివధర్‌రెడ్డి
- యువ పోలీసులు డిపార్ట్‌మెంట్‌కు మంచిపేరు తేవాలని సూచన
- కొత్త డీజీపీ సీవీ ఆనంద్ చాలెంజింగ్ అధికారి అని ప్రశంస
హైదరాబాద్, వెలుగు: పోలీసులకు, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామని, ప్రస్తుత పరిస్థితులకు సిటిజన్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అవసరమని మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. పోలీస్ అధికారిగా తన 32 ఏళ్ల సర్వీస్‌లో ఎన్నో సమస్యలు, ఆనందం, అనుభవాల జ్ఞాపకాలతో ప్రయాణం చేశానని అన్నారు. పోలీస్ పవర్ అంటే గౌరవంగా జీవించడమని పేర్కొన్నారు. యువ పోలీసులు డిపార్ట్‌మెంట్‌కు మంచిపేరు తేవాలని సూచించారు.
తెలంగాణకు మంచి చాలెంజింగ్ అధికారి సీవీ ఆనంద్ డీజీపీగా రాబోతున్నారని కొనియాడారు. డీజీపీగా పదవీ విరమణ సందర్భంగా గురువారం రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన ఫేర్‌వల్ పరేడ్‌లో శివధర్ రెడ్డి సహా నూతన డీజీపీ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.1970, 1980లో ఉన్న పరిస్థితులకు, ఇప్పుడు ఉన్న పోలీసింగ్‌లో చాలా తేడా వచ్చిందన్నారు. పోలీస్ అధికారికగా తను చేసిన సేవలను వివరించారు. తాను ఎంతగానో ఇష్టపడే తన మాతృ రాష్ట్రానికి డీజీపీగా సేవలు అందించడం తన జీవితంలో మర్చిపోలేని క్షణాలన్నారు. ఆ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.- ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల నమ్మకాన్ని గెలిచామని, ప్రభుత్వాల విధానాలకు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించామన్నారు.
పూలతో అలంకరించిన వాహనంలో శివధర్ రెడ్డిని ఐపీఎస్ అధికారులు తాళ్లతో లాగుతుండగా.. సిబ్బంది పూలు చల్లుతూ కార్యాలయ ప్రధాన ద్వార వరకు సాగనంపారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, శాంతిభద్రతల డీజీ మహేశ్ భాగవత్ సహా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్‌లో శివధర్ రెడ్డి సక్సెస్: సీవీ ఆనంద్
డీజీపీగా పదవీ విరమణ పొందుతున్న శివధర్‌రెడ్డిని తాను దగ్గరగా చూశానని, సమైక్య రాష్ర్టంలో ఆయన ఎన్నో సవాళ్లు అధిగమించారని కొత్త డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. మావోయిజం ప్రాబల్య ప్రాంతాల్లో శివధర్ రెడ్డి సేవలు అందించారని చెప్పారు. ఎన్‌కౌంటర్లు, మావోయిస్టుల సరెండర్లలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అదే సమయంలో పోలీస్ కుటుంబాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. ఇటీవల కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ తెలంగాణలో విజయవంతం కావడంలో శివధర్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమైందన్నారు.

